Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు అమిత్ షా నిందితునిగా ఉన్న సోహ్రాబుద్ధీన్ ఎన్ కౌంటర్ కేసు విచారణ న్యాయమూర్తి బీహెచ్ లోయాది సహజమరణమే అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయాది సహజ మరణమేనని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని, ఈ కేసులో ఎలాంటి స్వతంత్ర విచారణ అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లు కొట్టివేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు రాజకీయ నాయకులు, అధికారులు నిందితులుగా ఉన్న సోహ్రాబుద్ధీన్ ఎన్ కౌంటర్ కేసు విచారణ న్యాయమూర్తిగా ఉన్న సీబీఐ ప్రత్యేక జడ్జి బీహెచ్ లోయా 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో మృతిచెందారు. అయితే ఆయనది సహజ మరణం కాదని, ఆయన మృతి వెనక కుట్ర ఉందని లోయా సోదరి ఆరోపించారు. దీంతో లోయా మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై ఇటీవల మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులు కూడా లోయా కేసు గురించి ప్రస్తావించారు. అయితే లోయా కుమారుడు మాత్రం తన తండ్రిది సహజమరణమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో లోయా మృతిపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనది సహజమరణమేనని తీర్పు వెల్లడించింది. ఈ పిటిషన్లకు ఎలాంటి అర్హతా లేదని, లోయాతో పనిచేసిన నలుగురు జడ్జిల వ్యాఖ్యలను అనుమానించాల్సిన అవసరం లేదని, స్పష్టంచేసింది. పిటిషన్లలో విచారించదగ్గ అంశాలేవీ లేవని, న్యాయవ్యవస్థను నిందించడానికే ఈ పిటిషన్లు వేశారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పిటిషనర్లపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని, వ్యాపార లేదా రాజకీయ విభేదాలను పరిష్కరించుకునేందుకు కోర్టులు వేదిక కాకూడదని హెచ్చరించింది.