Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశమంతా ఆతృతతో, ఆసక్తితో గమనిస్తున్న అయోధ్య కేసులో సస్పెన్స్ మరికొన్నాళ్లు కొనసాగనుంది. వివాదాస్పద భూమిపై ఇవాళ తుదితీర్పు వస్తుందని భావించినప్పటికీ… సున్నీ వక్ఫ్ బోర్డు మరోసారి గడువు కావాలని కోరడంతో తదుపరి విచారణ 2018 ఫిబ్రవరి 8కి వాయిదా పడింది. వివాదాస్పద భూమిపై 2010లో అలహాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. భూమి సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోఖీ అఖారా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ 13 అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, అబ్దుల్ నజీబ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కేసు విచారణను 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత చేపట్టాలని కోరారు. కపిల్ సిబాల్ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సంబంధిత పత్రాల అనువాదానికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు గడువు కావాలన్న అభ్యర్థనను మాత్రం అంగీకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషనర్ కు ఇదే చివరి అవకాశమని న్యాయమూర్తులు స్ఫష్టంచేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి రేపటికి సరిగ్గా 25 ఏళ్లు. 1992 డిసెంబరు 6న కరసేవకులు మసీదును కూల్చివేయడంతో దేశం యావత్తూ ఉలిక్కిపడింది. ఈ ఘటన జరిగి ఆరు నెలలైనా గడవకముందే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ ఐఎస్ ఐ సహకారంలో ముంబై పేలుళ్లకు ఒడిగట్టాడు. మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దేశ ఆర్థిక రాజధానిలో జరిగిన ఈ పేలుళ్లు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. అప్పటినుంచి దేశంలో మతకల్లోలాలు పెరిగాయి. దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు బాబ్రీ మసీదు కూల్చివేత పెద్ద కుదుపు. రాజకీయ పార్టీలకయితే ఇప్పటికీ అది ప్రచారాస్త్రమే. వివాదాస్పద ప్రాంతంలో రామాలయాన్ని నిర్మించాలన్నది బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. మోడీ హయాంలో రాయాలయం కల నెరవేరుతుందని హిందువులంతా ఆశతో ఉన్నారు.