భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది.
ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.
దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.