వీళ్లిద్దరినీ కన్విన్స్ చేసి రానా ఈ సినిమాను నిర్మించాడట

వీళ్లిద్దరినీ కన్విన్స్ చేసి రానా ఈ సినిమాను నిర్మించాడట

టాలీవుడ్లో ట్రెండుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ సినిమాలు తీస్తున్న నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఒకప్పుడు ఆయనతో పాటే యాక్టివ్‌గా సినిమాలు నిర్మించిన చాలామంది నిర్మాతలు ఔట్ డేట్ అయిపోయి పక్కకు వెళ్లిపోగా.. సురేష్ మాత్రం తండ్రి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ట్రెండీగా సినిమాలు తీస్తున్నారు. ఆయన సంస్థ నుంచి తాజాగా వచ్చిన సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’.

ఇప్పటి యువత మనోభావాలకు అద్దం పట్టేలా ఉన్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై మంచి స్పందన రాబట్టుకుంది. ఐతే ఇంత మంచి విజయం సాధించిన ఈ సినిమా స్క్రిప్టు దశలో సురేష్ బాబుకు ఏమాత్రం నచ్చలేదట. ఆయనకే కాదు.. తన భార్యకు కూడా ఈ కథ నచ్చలేదట. ఐతే వీళ్లిద్దరినీ కన్విన్స్ చేసి రానా ఈ సినిమాను నిర్మించాడట. ఈ విషయాన్ని సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇందులో హీరో ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడపడం అనే కాన్సెప్ట్‌ సురేష్ బాబుకు నచ్చలేదట. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ఇప్పటి యూత్ ఇలాగే ఉన్నారని.. తన స్నేహితుల్లో కూడా అలాంటి వాళ్లను చూశానని.. కాబట్టి కొంచెం అర్థవంతంగా, కన్విన్సింగ్‌గా చెబితే యువ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని రానా తనకు చెప్పాడని.. ఆ తర్వాత తనలాగే అభ్యంతరం వ్యక్తం చేసిన తన భార్యను కూడా రానా కన్విన్స్ చేశాడని.. ఆ తర్వాతే సినిమా నిర్మాణం మొదలుపెట్టాడని సురేష్ వెల్లడించారు.

ఇక నెట్ ఫ్లిక్స్, అమేజాన్‌లతో పాటు తెలుగులో ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బాగా నడుస్తున్న నేపథ్యంలో మీరు కూడా సొంతంగా ఓటీటీ పెడతారా అని సురేష్ బాబును అడిగితే.. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని.. పెట్టుబడికి తగ్గ రాబడి రావడానికి ఓపిగ్గా చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుందని.. ఐతే తాను ఓటీటీ బిజినెస్‌లోకి వస్తానో రానో ఇప్పుడు చెప్పలేనని సురేష్ అన్నారు.