రెండేళ్లలో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి అరడజను దాకా రీమేక్‌లు రాబోతున్నట్లు సమాచారం. తెలుగు రచయితలు, దర్శకుల నుంచి తాము ఆశించిన స్థాయిలో కొత్త కథలేవీ రాకపోవడంతో సురేష్ బాబు పరభాషా చిత్రాల మీద ఫోకస్ పెట్టారు. హిందీలో సూపర్ హిట్టయిన ‘సోనూ కీ ట్వీటూకీ స్వీటీ’, ‘డ్రీమ్ గర్ల్’ సినిమాల రీమేక్ హక్కుల్ని సురేషే సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు మరో తమిళ చిత్రం, రెండు కొరియన్ సినిమాలు కూడా నచ్చి హక్కులు కొన్నారట సురేష్.
ఈ ఏడాదే సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ‘ఓ బేబీ’ కూడా ఓ కొరియన్ మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ భాషలో ఇంకా మంచి సినిమాలేమైనా ఉన్నాయా అని చూసి రెండు చిత్రాల హక్కులు కొన్నట్లు తెలుస్తోంది. ‘సోనూ కీ..’ సినిమా రీమేక్ మీద ఏడాది కిందట్నుంచే టాలీవుడ్లో డిస్కషన్లు నడుస్తున్నాయి. అల్లు అర్జున్ అని రానా అని ఈ సినిమా హీరోలుగా కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎటూ తేలలేదు.
కానీ రీమేక్ హక్కులు మాత్రం సురేష్ దగ్గరే ఉన్నాయి. కొన్ని నెలల కిందటే వచ్చిన ఆయుష్మాన్ ఖురానా సినిమా ‘డ్రీమ్ గర్ల్’ కూడా నచ్చి హక్కులు తీసుకున్నారాయన. వచ్చే ఏడాది ‘అసురన్’తో పాటు ఇంకో రెండు రీమేక్స్ పట్టాలెక్కుతాయని సమాచారం. మరోవైపు రానాతో ‘హిరణ్య కశ్యప’ సినిమాను కూడా సురేష్ నిర్మించాల్సి ఉంది. దాని బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లు కావడం విశేషం.