బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్‌పుత్ విషాదాంతంపై ఆయన తండ్రి సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఈ కేసు మలుపు తిరిగింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో బిహార్ పోలీసులు రంగంలోకి దిగడంతో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వ్యవహారంపై ప్రకటనలు చేస్తున్నారు.
తాజాగా సుశాంత్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందని బిహార్ మంత్రి, జేడీయూ నేత మహేశ్వర్ హజారి అన్నారు. ఈ కేసులో రియా చక్రవర్తి కాంట్రాక్ట్ కిల్లర్‌లా వ్యవహరించారని, ఆమె విషకన్యని హజారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ను ప్రేమ పేరుతో ఆటాడుకున్న రియా అతడి నుంచి డబ్బులు గుంజుకుని ఆపై వదిలివేశారని ఆరోపించారు. ‘ఇది ఆత్మహత్య కాదు..హత్యే, పథకం ప్రకారం సుశాంత్‌ను రియా అంతమొందించారు..దీనిపై దర్యాప్తు జరగాల’ని హజారి స్పష్టం చేశారు.
సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు సరిగ్గా తమ పని చేయడం లేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి బిహార ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా అవసరమైన సాయం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సుశాంత్ రాజ్‌పుత్‌కు న్యాయం జరగాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం భావిస్తున్నారని చెప్పారు.
మరోవైపు రియా పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదన వినాలని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో గురువారం కేవియట్ దాఖలు చేసింది. సుశాంత్ రాజ్పుట్ జూన్ 14న ముంబై బాంద్రా నివాసంలో విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. సుశాంత్ అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని పలువురు అభిమానులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.