ఇండస్ట్రీలోని గ్యాంగ్‌ల వల్లే సుశాంత్‌ మరణించాడు

ఇండస్ట్రీలోని గ్యాంగ్‌ల వల్లే సుశాంత్‌ మరణించాడు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి రెండు వారాలకు పైనే అయినప్పటికి.. ఇంకా అతడి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు.. బాలీవుడ్‌ స్టార్లపై విమర్శలు ఆగడం లేదు. ఈ క్రమంలో టెలివిజన్‌ హోస్ట్‌, నటుడు శేఖర్‌ సుమన్‌ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లోని బంధుప్రీతి వల్ల సుశాంత్‌ మరణించలేదని.. ఇండస్ట్రీలోని గ్యాంగ్‌ల వల్లే అతడు‌ ఆత్యహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను కలిసిన శేఖర్‌ సుమన్‌ దీని గురించి చర్చించానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కంటికి కనిపించే దాని కంటే ఎక్కువగా ఏదో జరిగినట్లు సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి.

వీటన్నింటిని గమనిస్తే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి’ అన్నారు. అంతేకాక ఓ సిండికేట్‌, మాఫియా చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయని అన్నారు. ఇవే ఓ యువ నటుడి భవిష్యత్తును నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సిండికేట్‌లో భాగస్వాములైన స్టార్లందరు తనకు తెలుసని.. కానీ సరైన ఆధారాలు లేనందున వారి పేర్లు వెల్లడించడం లేదన్నారు.

‘సుశాంత్‌ గత నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 50 సిమ్‌ కార్డులు మార్చాడు. ఎవరి నుంచి తప్పించుకోవడం కోసం అతడు ఇలా చేశాడు. వృత్తిపరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా తెలియాలి. బంధుప్రీతి వల్ల సుశాంత్‌ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. ఇండస్ట్రీలోనే గ్యాంగ్‌ల వల్లే సుశాంత్‌ మరణించాడు’ అంటూ శేఖర్‌ సుమన్‌ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ సింగ్‌ కుటుంబాన్ని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పరామర్శించకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.