బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండు నెలలకు పైనే అవుతోంది. రోజులు గడుస్తున్న కొద్ది సుశాంత్ మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ రాజ్‌పుత్‌కు చెందిన ఒక బ్యాంక్ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన స్వతంత్ర ఆర్థిక విశ్లేషణ జరిగింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థిక ఫోరెన్సిక్ నిపుణుడు నమ్రత కనోడియా సుశాంత్ బ్యాంక్ స్టేట్ట్‌మెంట్‌లలో ఒకదాన్ని పరిశీలించారు. ఈ డబ్బు ఎక్కువగా ప్రయాణ, వ్యక్తిగత విలాసాలు, చారిటీలకు సహాయం, దాతృత్వం, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఖర్చు చేయబడిందని తెలిపారు. ఇందులో కొంత మొత్తం రియా, ఆమె సోదరుడి కోసం కూడా ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు.
ఈ సందర్భంగా కనోడియా మాట్లాడుతూ.. ‘సుశాంత్ బ్యాంక్ అకౌంట్‌ను మేం పరిశీలించినప్పుడు వివిధ హెడర్ల కింద ఈ ఖర్చులు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిలో రియా, ఆమె సోదరుడు కూడా ఉన్నారు. త ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సుశాంత్ మొత్తం 4.6 కోట్ల రుపాయాలు ఖర్చు చేశాడు. దానిలో ప్రయాణానికి సుమారు 42 లక్షలు, పవానా (మహారాష్ట్ర) లోని ఒక ఫామ్‌హౌస్‌కు 33 లక్షలు, వ్యక్తిగత విలాసాలకు 1.1 కోటి రుపాయాలు ఖర్చు చేసినట్లు మేము గుర్తించాము’ అని తెలిపాడు. ‘ఇక రియా కోసం, ఆమె సోదరుడి కసం 9.5 లక్షల రుపాయాలు ఖర్చు చేశాడు. దీనిలో వారి విమాన టిక్కెట్ల కోసం 1.7 లక్షల రుపాయాలు.. 4.72 లక్షలు రియా సోదరుడి హోటల్ ఖర్చుల కోసం.. 3.4 లక్షలు ఆమె షాపింగ్, మేకప్, ఇతర ఖర్చుల కోసం వాడినట్లు గుర్తించాము’ అన్నారు కనోడియా.
గతంలో ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా తాను సుశాంత్ డబ్బుతో జీవిస్తున్నాననే వార్తలను ఖండించారు. ‘అతను ఓ స్టార్‌లాగా జీవించడానికి ఇష్టపడేవాడు. తన డబ్బుతో నేను జీవించడం లేదు. మేం ఓ జంటలాగా కలిసి ఉన్నామని’ తెలిపారు. అలానే సుశాంత్ చార్టెడ్ అకౌంటెంట్ సందీప్ శ్రీకాంత్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. సుశాంత్, రియాకు గానీ.. ఆమె కుటుంబ సభ్యులకు కానీ భారీ మొత్తంలో అనగా లక్షల రుపాయాలు లావాదేవీలు చేయలేదని తెలిపారు. వేలల్లోనే డబ్బు పంపారన్నాడు. ఒక సారి రియా తల్లి సుశాంత్‌కి 33 వేల రూపాయలు బదిలీ చేసిందన్నాడు. సుశాంత్ సినిమా హీరో. దానికి తగ్గట్లే అతడు తన జీవితాన్ని జీవించాడు అని తెలిపాడు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం రియాను దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించింది.