పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ భద్రత నడుమ అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రెండు రోజుల క్రితమే అతడిని ఆస్పత్రిలో చేర్చారట.
మీడియా కథనాల ప్రకారం.. కరాచీలోని ఓ ఆస్పత్రిలో ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసి కేవలం దావూద్ ఒక్కడినే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేవలం వైద్యులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆ అంతస్తుకు అనుమతిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. వీటిపై దావూద్ సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు ముంబయి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.