ఊహించని ఎదురుదెబ్బ

ఊహించని ఎదురుదెబ్బ

అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్‌ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బీజేపీలో కీలక ఓబీసీ నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య నిన్ననే మంత్రి పదవికి రాజీనామా చేశారు. యోగి ప్రభుత్వంలో ఓబీసీ, దళితులు, యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించారు.

కాగా, స్వామి ప్రసాద్‌ మౌర్య తన రాజీనామా లేఖలో.. ‘భిన్నమైన భావజాలం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో అంకితభావంతో పనిచేశాను. కానీ దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్ర అణచివేతకు గురవుతున్నందున రాజీనామా చేస్తున్నాను’ అని స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

నా నిష్ర్కమణ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలనుందని ఆయన విలేకరులతో అన్నారు.ఓబీసీలో బలమైన నేతగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య 2016లో బీఎస్పీ నుంచి బీజేపీలో చేరారు. తాజాగా ఎస్పీ గూటికి చేరారు. మంత్రి ధరమ్‌సింగ్ సైనితోపాటు మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలోనే అఖిలేష్‌ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.