నోబెల్ చ‌రిత్ర‌లో అనూహ్య ప‌రిణామం.. ఈ ఏడాది సాహిత్యంలో అవార్డ్ లేదు…

Swedish Academy Announced Not Giving Noble Prize To Literature

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నోబెల్ బ‌హుమ‌తుల చ‌రిత్ర‌లో అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే నోబెల్ సాహిత్య పుర‌స్కారాన్ని ఈ ఏడాది ఇవ్వ‌డం లేద‌ని స్వీడిష్ అకాడమీ ప్ర‌క‌టించింది. 2018లో ఇవ్వాల్సిన బహుమ‌తిని కూడా 2019లో ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టంచేసింది. స్వీడిష్ అకాడమీలో ఇటీవ‌ల చోటుచేసుకున్న ప‌రిణామాలు ఈ నిర్ణ‌యానికి దారితీశాయి. అకాడ‌మీలో స‌భ్యురాలిగా ఉన్న ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, క‌వ‌యిత్రి క‌టారినా ఫ్రోస్టెన్స‌న్ భ‌ర్త‌, ప్ర‌ముఖ సాహితీవేత్త జీన్ క్లౌడ్ అర్నాల్ట్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో క‌టారినా అకాడ‌మీ నుంచి త‌ప్పుకున్నారు. ఇది మ‌రిన్ని వివాదాల‌కు దారితీయ‌డంతో…అకాడ‌మీ నుంచి మ‌రో ఏడుగురు స‌భ్యులు కూడా త‌ప్పుకున్నారు. 

ఈ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సాహిత్యంలో నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌ను ఎంపిక చేసే ప‌రిస్థితిలో క‌మిటీ లేద‌ని, అకాడ‌మీ ప్ర‌క‌టించింది. స్టాక్ హోంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న క‌మిటీ ఈ మేర‌కు ఓ  ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. అకాడ‌మీ ర్యాంకుల్లో ఉన్న స‌భ్యుల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు, మ‌రికొన్ని స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో అకాడ‌మీ ప్ర‌తిష్ట దెబ్బతింద‌ని, ఇప్పుడు సాహిత్యంలో అవార్డ్ గ్రహీత‌ను నిర్ణ‌యించగ‌లిగే స్థితిలో క‌మిటీ లేద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. మ‌స‌క‌బారిన అకాడ‌మీ ప్ర‌తిష్ట‌ను పున‌రుద్ధ‌రించ‌డంపైనే త‌మ ప్ర‌య‌త్నాల‌న్నీ కేంద్రీక‌రించిన‌ట్టు పేర్కొంది. 2019లో రెండు అవార్డులు ఇస్తామ‌ని తెలిపింది. ఇత‌ర నోబెల్ అవార్డుల‌కు దీనితో సంబంధం లేద‌ని, అవి య‌ధావిధిగా ఇస్తామ‌ని స్ఫ‌ష్టంచేసింది. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత నోబెల్ సాహిత్య పుర‌స్కారం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి.