ప్రస్తుతం మార్కెట్లో లభించే స్వీట్లు, డిసర్టులు ఎక్కువగా శుద్ధి చేసిన చక్కెరతోనే తయారుచేయబడుతున్నాయి. అందువల్ల మీరు చక్కెర తినే అలవాటును మానుకోవాలి. ఈ అలవాటును మానడం అంత సులువు కాదు. కానీ దశల వారీగా షుగర్ తినే అలవాటును నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.మీకు ఇష్టమైన స్వీట్‌ను తిన్నప్పుడు మీ శరీరంలో డొపమైన్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
కావున తదుపరి ఎప్పుడైనా మీరు ఒత్తిడికి గురైనప్పుడు మళ్లీ మీకు స్వీట్ తినాలని అనిపిస్తుంది. ఏ సమయంలో అయినా మీరు ఒత్తిడికి గురైనప్పుడు ఇలా స్వీట్లను తినడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పంచదార తినే అలవాటును నియంత్రించుకోవడం వల్ల మీరు బరువు తగ్గడమే కాకుండా మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా మీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.
మీరు షుగర్ తినడం తగ్గించుకోవాలని భావిస్తే మీరు చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే.. మీ వంటగదిలో ఉండే అన్ని రకాల స్వీట్లను తొలగించాల్సి ఉంటుంది. మీ కిచెన్‌లో ఉండే అన్ని రకాల చాక్లెట్లు, స్వీట్లకు మీరు త్వరగా లొంగిపోతారు. అప్పుడు మీరు అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో విఫలమవుతారు. వంటగదిలో మీకు స్వీట్లు కనిపించకపోతే మీరు కోరుకునే ఆహారాన్ని తయారుచేసుకునేందుకు కొంచెం మెదడును ఉపయోగించగలుగుతారు. తద్వారా శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి నుంచి దూరం అవుతారు.
మరోవైపు మీరు రోజూ తినే ఆహారంలో చక్కెర పదార్థాలు లేకుండా చూసుకోవాలి. బియ్యంతో చేసిన పదార్థాలు, కేకులు, పాస్తాలు, ప్రాసెస్ చేసిన పిండితో చేసిన ఆహారాలలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీంతో శుద్ధి చేసిన పంచదార తరహాలోనే ఇవి కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, స్వీట్లు, కేక్‌లు, కెచప్‌లకు దూరంగా ఉండాలి. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే.. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
చక్కెర పదార్థాలను తినడం తగ్గించడం వల్ల తక్షణ ఫలితాలు చూపకపోయినా.. దీర్ఘకాలంలో అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే ఒక్కసారిగా చక్కెర పదార్థాలను తినడం మానేయకూడదు. తినే ఆహారంలో సహజ చక్కెర ఉండే పండ్లు, కూరగాయలను స్వల్ప మొత్తంలో తీసుకోవాలి. ఒకవేళ షుగర్ పదార్థాలు తినకుండా ఉండటం కష్టంగా అనిపిస్తే.. ఒకేసారి మానేయకుండా మెల్లమెల్లగా మానేయండి. రోజు తీసుకునే చెక్కర పదార్థాల స్థాయిని క్రమంగా తగ్గించాలి.
పగటిపూట తగినంత ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడమే కాకుండా షుగర్ తినాలనే కోరికలను దూరం చేస్తుంది. బరువు పెరగడం, చక్కెర తినాలనే కోరికలను నివారించడానికి మీరు ప్రతి 4-5 గంటలకు కనీసం 20 గ్రాముల ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. రెండు కోడిగుడ్లు, ఒక గ్లాసు ప్రోటీన్ షేక్, 100 గ్రాముల పనీర్, 1 కప్పు పెరుగుతో కొన్ని కూరగాయలు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. 100 గ్రాముల చికెన్ తీసుకోవడం ద్వారా 20 గ్రాముల ప్రోటీన్‌ను సులభంగా పొందవచ్చు.
మీరు రోజులో తినే ఆహారాన్ని భారీ మొత్తంలో కాకుండా కొంచెం కొంచెంగా తింటే శరీరంలో కార్బోహైడ్రేట్ల స్థాయి తగ్గుతుంది. అందువల్ల రోజుకు 3 నుంచి 4 సార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకునే అలవాటును అలవర్చుకోవాలి. దీంతో శరీరానికి తగినంత విశ్రాంతి కూడా లభిస్తుంది. ఇన్సులిన్ కూడా నిరోధించబడుతుంది. ఒకేసారి పెద్దమొత్తంలో భోజనం చేయడం వల్ల కడుపు నిండుగా ఉండి నిద్ర వస్తుంది.
దీని వల్ల మీ శరీరంలో కార్బోహైడ్రేట్లు పెరిగిపోవడంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. జిమ్ చేసిన తర్వాత ఉదయం 10 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్, రాత్రి 7 గంటలకు రాత్రి భోజనం తీసుకోవచ్చు. ప్రతిరోజూ మీరు చివరగా ఆహారం తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలని గుర్తుచేసుకోండి. ఈ విధంగా మీరు ఆహారపు అలవాట్లను స్వీకరించడం వల్ల షుగర్ తినాలనే కోరికలు నశిస్తాయి.
ప్రతిరోజూ మీరు మంచినీరు ఎక్కువగా తీసుకుంటూ శరీరం హైడ్రేట్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ అనేది చక్కెర తినాలనే కోరికలను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగేలా చూసుకోండి. బెర్రీలు, పుచ్చకాయ, అరటి, ఫైబర్ కలిగిన పండ్లలో ఉండే సహజ చక్కెరలు.. తీపిపదార్థాలు తినాలనే మీలోని కోరికలను సంతృప్తి పరుస్తాయి.
అలాగే రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. వాల్ నట్స్, ఫ్యాటీ ఫిష్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వు కలిగిన పదార్థాలు.. తీపి పదార్థాలు తినాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతాయి. అవకాడో కూడా చాలా ప్రభావం చూపుతుంది. మీరు తినే ఆహారంలో పంచదారకు బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు తేనె, బెల్లం, కొబ్బరిని వాడవచ్చు.
షుగర్ తినే అలవాటును తగ్గించుకుంటే అది గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కావిటీస్, దంతాల రంగు మారడం, నోటి దుర్వాసనను తగ్గించడం ద్వారా మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 2014లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక్క రోజులో 17 నుంచి 21 శాతం కేలరీల షుగర్‌ను తీసుకునే వ్యక్తులు.. తక్కువ చక్కెరను వినియోగించే వ్యక్తుల కంటే 38 శాతం అధికంగా గుండె జబ్బుల బారిన పడి మరణిస్తున్నట్లు తేలింది.