మండే రోజు నామినేషన్ ప్రక్రియతో మళ్లీ అగ్గి రాజేశాడు బిగ్‌బాస్. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుందన్నాడు. నక్క టీములో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్ ఉండగా; గద్ద టీములో లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంక ఉన్నారు. హౌస్మేట్స్ ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్‌పై పెయింట్ పూయాల్సి ఉంటుందన్నాడు. అయితే ఇంటిసభ్యులు వాళ్ల టీమ్ కాకుండా ఇతర టీమ్‌లో నుంచి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు. సిరి కెప్టెన్ కావడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు.
శ్వేత ఒక్కొక్కరికీ బొమ్మ చూపించింది. అసలు రంగులు బయటపడుతున్నాయంటూ లోబో కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ను పడేసింది. నా లైఫ్‌లో నన్ను ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఒక్కదాన్నే ఇక్కడి దాకా వచ్చానని ఆవేశపడింది. కాజల్, ప్రియ లేనప్పుడు వాళ్ల గురించి మాట్లాడావు, ఇప్పుడు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ లోబోకు ఇచ్చిపడేసింది. సెట్ శ్వేత లేదని ఎలా అన్నావు? అంటూ హమీదా మీద చిందులు తొక్కింది. మీరిద్దరూ ఫేక్ అని తిట్టిపోసింది.
ఆడవాళ్లకు ఆడవాళ్లైనా గౌరవం ఇవ్వాలని ఉమాదేవి మీద మండిపడటంతో ఇంటిసభ్యులు అందరూ చప్పట్లు కొట్టారు. మిమ్మల్ని సపోర్ట్ చేసిన యానీ మాస్టర్‌ను అన్ని మాటలు ఎలా అనగలిగావు? అని నిలదీయడంతో మాస్టర్ కన్నీటిపర్యంతమైంది. అయితే ఉమా మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. ఇక హమీదాను ఫేక్ అంటూ గట్టిగా ఆమె ముఖం మీద కొట్టినట్లుగా రంగు పూసింది.
కళ్లలో పడుతుందని వారిస్తున్నా తనకు అనవసరం అంటూ దురుసుగా ప్రవర్తించింది. అయితే శ్వేత తను నన్ను కొట్టిందంటూ ఏడ్చేసింది హమీదా.అది అక్కడున్నవాళ్లందరికీ అర్థం కాగా.. మానవత్వం గురించి మాట్లాడిన నువ్వు చేసిందేంటి? అని శ్వేతను ప్రశ్నించింది ప్రియ. దీంతో తన తప్పు అంగీకరించిన శ్వేత మోకాళ్లపై కూర్చుని హమీదాకు సారీ చెప్పింది. అమ్మాయికి క్షమాపణలు చెప్పింది కానీ తనకు మాత్రం సారీ చెప్పలేదని హర్ట్ అయ్యాడు లోబో.