డెలివరీ సేవల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకుగాను స్విగ్గీ ప్రముఖ దేశీయ టూవీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్స్‌తో జతకట్టింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలను ఫుడ్ డెలివరీలతో పాటు ఆన్-డిమాండ్ సేవలు, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 8 లక్షల కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు తిరిగేలా ప్రణాళికలను స్విగ్గీ ప్రకటించింది. వీలైనంతా త్వరగా ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ సేవలను అందిస్తామని స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ మిహిర్ రాజేష్ షా వెల్లడించారు.
వివిధ మొబిలిటీ విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని టీవీఎస్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తమ వినియోగదారులకు అవసరమైన స్థాయిలో వాహనాలను అందించడంలో ముందుంది. ఈ ఒప్పందం దేశీయ వాహన మార్కెట్లో ఈవీలకు మరింత ఆదరణను పెంచుతుందని ఆశిస్తున్నట్లు టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఫ్యూచర్ మొబిలిటీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మను సక్సెనా చెప్పారు. స్విగ్గీ-టీవీఎస్ మోటార్స్ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ప్రధాన నగరాల్లో స్విగ్గీ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, పూణె, కొచ్చి, కోయంబత్తూరుతో సహా 33 నగరాల్లో అందుబాటులో ఉంది.