మోసం: అర్థగంట స్విచ్ఛాప్ చేసి.. ఆపై రూ. 11 లక్షలు కాజేశారు..

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు ఎక్కవైపోతున్నారు. కరోనా.. లాక్ డౌన్ కాలాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఓ యువకుడి బ్యాంక్‌ అకౌంట్‌లో నుంచి రూ.11.30 లక్షలు మాయమైన ఘటన హైదరాబాద్‌లో తాజాగా కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కిషోర్‌ హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడి సెల్‌ఫోన్ ఉన్నట్టుండి స్విచ్ఛాఫ్‌ అయిపోయింది. దాదాపు అరగంట వరకు ఫోన్‌ ఆన్‌ కాలేదు. ఆ తర్వాత ఫోన్‌ ఆన్ చేసి చూస్తే అందులో నుంచి చాలా యాప్‌లు డిలీట్‌ అయ్యాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ చేసేందుకు ఉపయోగించే ‘యూనో’ యాప్‌ కూడా డిలీట్‌ అయిపోయింది.

అయితే వెంటనే కంగారుగా కిషోర్‌ సొంతూరులో ఉండే తన తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆయన బ్యాంక్‌కు వెళ్లి వివరాలు తెలుసుకున్నాడు. అంతే ఆతని అకౌంట్ నుంచి 4 దఫాలుగా రూ.11.30 లక్షలు అకౌంట్ నుంచి డ్రా అయినట్లు నమోదై ఉంది. కాగా ఆ డబ్బు మొత్తం అఖిల ఆనే మహిళ పేరిట డ్రా అయిందని.. దానితో కొన్ని విలువైన వస్తువులు కొన్నట్లుగా బ్యాంక్ అధికారులు వెల్లడించారు. దీంతో ఖంగుతిన్న కిషోర్ వెంటనే హైదరాబాద్‌లోని సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు జరపుతున్నారు.