టీ20 ప్రపంచకప్ ఇక కష్టమే : ఆస్ట్రేలియా

కరోనా.. లాక్ డౌన్ కారణంగా క్రికెట్ అభిమానులకు నిరాశ ఎదురైంది. టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు అంటూ ఆతిథ్యదేశం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో ఇక చేసేది లేక క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) పై ఆశలు పెంచుకుంటున్నారు.

ఐపీఎల్ ను నిర్వహించడంపై కూడా బీసీసీఐ ఆలోచన చేస్తుంది. అయితే టి20పై ఏదో ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఐపీఎల్ నిర్వహణపై ఆలోచిస్తామని బీసీసీఐ ఇదివరకే ఓ ప్రకటన కూడా చేసిన విషయం తెలిసింది. ఇలాంటి సమయంలో ఫ్రాంచైజీలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమయంలో పూర్తి స్థాయిలో లేదా కుదించి అయినా నిర్వహించాలని కోరుతున్నాయి.

కాగా భారత్ లో కాకున్నా విదేశాల్లో అయినా నిర్వహించాలని ప్రాంచైజీలు కోరుతున్నాయి. లీగ్ పరిధి విషయంలో బీసీసీఐ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో పాటు యజమాని నెస్ వాడియా తెలిపారు. అలాగే.. లీగ్ నిర్వహణ భారత్‌లో సాధ్యం కాకపోతే.. శ్రీలంక, న్యూజిలాండ్‌లోనైనా నిర్వహించవచ్చని స్పష్టం చేశారు.