ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తాసిల్దార్ లావణ్యను రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం అనుమతించింది. ప్రస్తుతం లావణ్య చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు లావణ్యను శుక్రవారం కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపనున్నారు. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఇటీవల ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా, అతడు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు హయత్నగర్లో తాసిల్దార్ లావణ్య ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.93 లక్షల నగదు, 40 తులాలకుపైగా బంగారం పట్టుబడటంతో కేసు పెట్టిన ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టుచేశారు. రెండ్రోజుల కస్టడీలో లావణ్య నుంచి ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు సేకరించనున్నారు.