Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇన్నాళ్లూ ప్రేమకు మారుపేరుగా నిలిచిన తాజ్ మహల్ ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. తాజ్ మహల్ కేంద్రంగా నడుస్తున్న రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఆరు నెలలు పూర్తిచేసుకున్న సందర్భంగా విడుదల చేసిన టూరిజం బుక్ లెట్ లో తాజ్ మహల్ పేరు కనిపించకపోవడంతో మొదలయిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. సమాచార లోపం వల్లే ఈ తప్పిదం జరిగినట్టు యూపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ మాటలు నిజంకావని అందరికీ తెలుసు. ఆరెస్సెస్ నిర్దేశించిన ఓ ఎజెండాతోనే యూపీ ప్రభుత్వం ఈ వివాదానికి తెరలేపింది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మాటలు గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది. తాజ్ ను కట్టించిన మొఘల్ చక్రవర్తులు దేశద్రోహులని సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంగీత్ సోమ్ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.
బీజేపీ రాజకీయ అజెండాను సంగీత్ సోమ్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్య విధానాలు అవలంబించడం లేదని, నియంతృత్వ పోకడలను అనుసరిస్తోందని ఆరోపించారు. దేశంలో వివిధ మతాలు, వర్గాలు, జాతులు, కులాలకు చెందిన ప్రజలు ఉన్నారని, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో దేశ సమగ్రత దెబ్బతినే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. అభివృద్ధిని పక్కనపెట్టి, విద్వేష రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మనదేశ పేరును మార్చేందుకు కూడా బీజేపీ యత్నిస్తుందని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని మమత హెచ్చరించారు. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ కూడా సంగీత్ సోమ్ వ్యాఖ్యలపై స్పందించారు. అప్పటికాలంలో దేశాన్ని పాలించిన వారిని గుర్తుచేసే చారిత్రాత్మక కట్టడాలను ధ్వంసం చేయాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్, రాష్ట్రపతి భవనాలతో పాటు కుతుబ్ మీనార్, ఎర్రకోట, తాజ్ మహల్ లాంటి కట్టడాలు కూడా బానిసత్వానికి ప్రతీకలుగా ఉన్నాయని, వాటన్నింటినీ కూల్చి వేయాలని అజాంఖాన్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సంగీత్ సోమ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని కట్టడాలన్నీ దేశద్రోహులు నిర్మించినవి అయినప్పుడు….
ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని ప్రధాని ఆపేస్తారా అని అసదుద్దీన్ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం, ఉగ్రవాదం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అనవసర అంశాలను వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. తాజ్ మహల్ ను ఎవరు కట్టారు, ఎందుకు కట్టారనేది అనవసరమైన చర్చ అని, అయితే ఆ కట్టడాన్ని భారతీయ కార్మికుల రక్తం, చెమటతో నిర్మించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పర్యాటక కోణంలో తాజ్ మహల్ యూపీ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనదని, ఈ నెల 26న తాను తాజ్ మహల్ ను సందర్శిస్తున్నానని చెప్పారు. ప్రధాని మోడీ సైతం ఈ వివాదంపై స్పందించారు. చారిత్రక వారసత్వ గౌరవాలను విస్మరించి దేశాలు అభివృద్ధి చెందలేవని, ఒకవేళ వాటిని విస్మరిస్తే కచ్చితంగా ఏదో ఒక సమయంలో గుర్తింపును కోల్పోతామని ప్రధాని హెచ్చరించారు. ఇదంతా చూస్తుంటే తాజ్ మహల్ పై సాగుతున్న చర్చ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. నిజానికి ముగించాలన్న ఆలోచన కూడా కేంద్రప్రభుత్వానికి గానీ, యూపీ ప్రభుత్వానికి గానీ లేదు. ఇలా కొన్నిరోజులు వాదోపవాదాలు జరిగిన తర్వాత కేంద్రం తన అసలు ఆలోచనను బయటకు తెస్తుంది.
తాజ్ మహల్ ను నిజంగా నిర్మించింది ఎవరు అన్నదానిపై చర్చను లేవదీస్తుంది. ప్రస్తుతం ఆరెస్సెస్ గానీ, బీజేపీ నేతలు గానీ..ఇందుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ….తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తులు కట్టిన కట్టడం కాదని, హిందూ చక్రవర్తులు నిర్మించిన ఓ అందమైన, అద్భుతమైన కట్టడాన్ని తర్వాతి కాలంలో మొఘల్ చక్రవర్తులు ఆక్రమించుకుని… తాము నిర్మించినట్టుగా ప్రచారంలోకి తెచ్చారన్న విషయాన్ని దేశప్రజల నోళ్లల్లో నానేలా చేయాలన్నది తాజా వివాదం వెనక బీజేపీ అసలు ఉద్దేశం.. నిజానికి ఆరెస్సెస్ ఇలాంటి వ్యూహం రచించినప్పటికీ ఇది అమలు చేయడం చాలా కష్టం. తాజ్ మహల్ ను తన భార్యపై ప్రేమకు గుర్తుగా షాజహాన్ నిర్మించాడనేది దేశవ్యాప్తంగా నమ్ముతున్న నిజం. పాఠ్యపుస్తకాల్లోనూ అలానే ఉండడంతో చిన్న పిల్లలు సైతం ఈ విషయాన్నే చెబుతారు. ప్రపంచ దేశాల్లోనూ తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి ప్రేమకు నిలయమయిన కట్టడంగానే గుర్తింపు పొందింది. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న ఈ చరిత్రను చెరిపివేయడం ఆరెస్సెస్, బీజేపీ అనుకున్నంత తేలికగా జరిగిపోదు.