బాబుని మరోమారు టార్గెట్ చేసిన తలసాని !

Talasani Targets CBN

గత కొన్నాళ్ళగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్‌ చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తలసాని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీని ఎంచుకోవాలని కోరతామని కూడా ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తలసాని. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మరో రెండు నెలల్లో రానున్న ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చంద్రబాబుకు ఏపీలో పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమన్నారు. తెలంగాణలోని సెటిలర్స్‌ని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద చంద్రబాబు ఆరోపణలు చేయడం దారుణమని ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు పసుపు-కుంకమ పేరుతో డ్రామాలు మొదలు పెట్టారని ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.