గుంటూరులో ఆ సీట్లను హోల్డ్ లో పెట్టిన బాబు !

CBN

త్వరలో జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల ఎంపికలో తలమునకలైవున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న గుంటూరు జిల్లాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం అర్ధంతరంగా ముగిసింది. నిన్న ఆయన గుంటూరు లోక్ సభకు గల్లా జయదేవ్, తెనాలి నుంచి ఆలపాటి రాజా, పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. అయితే మిగతా ఐదు నియోజకవర్గాలు.. గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రోజు చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశయ్యారు.

ఈ నేపధ్యంలో ఆయన గల్లా జయదేవ్ సహా మరో ఇద్దరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ సీటు ఆయనదేనని స్పష్టం చేసిన ఆయన, పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్రకు, తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ లను ఖరారు చేసినట్టు స్పష్టం చేశారు. గుంటూరు లోక్ సభ పై రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించిన ఆయన, మిగతా నియోజకవర్గాల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టికెట్లు ఖరారైన నేతలు నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని సూచించారు. కాగా, అమెరికాలో విద్యాభ్యాసం చేసి, 2014లో తొలిసారిగా ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించిన గల్లా జయదేవ్, లోక్ సభలో బీజేపీని ఎండగట్టడంలో గట్టిగా నిలిచి, అధినేత మనసు దోచారు.

ఇక ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర, ఇప్పటివరకూ వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. సంఘం డెయిరీ చైర్మన్‌ గా, టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ శాసన సభ విప్‌ గానూ ఆయన విధులు నిర్వర్తించారు. ఇదే సమయంలో తెనాలి ప్రాంతంలో ఆలపాటికి ప్రజల్లో మంచి మద్దతు ఉందని, మరోసారి ఆయనే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు పలు సర్వేలు వెల్లడించడంతోనే ఆయనకు చంద్రబాబు టికెట్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు, మంగళగిరి మినహా మిగతా అన్ని స్థానాలనూ తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా, ఈ దఫా ఆ రెండింటిని కూడా గెలుచుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు బలమైన అభ్యర్థులను బరిలోకి నిలపాలని భావిస్తున్నారు.