నిండా 20 ఏళ్లకు ముందే భారత హాకీ జట్టులో కీలక ఆటగాడయ్యాడు సందీప్. ఇక ఈ ఆరడుగుల బుల్లెట్ కెరీర్ నల్లేరుమీద నడకలా సాగిపోతుందనుకుంటే అనుకోని ఉపద్రవం మిస్‌ఫైర్ రూపంలో ప్రాణంమీదికి తెచ్చింది. 2006 ప్రపంచకప్ (జర్మనీ)కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఓ ‘బుల్లెట్’ అతని వెన్నులోకి దూసుకెళ్లింది. జట్టుతో కలిసేందుకు సహచరుడు రాజ్‌పాల్‌తో కలిసి రైలులో వెళుతుండగా… రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) పోలీస్ అధికారి పొరపాటు వల్ల అతని రైఫిల్ మిస్‌ఫైర్ అయ్యింది. అదికాస్తా సందీప్ దిగువ వెన్నెముకను చిదిమేసింది. దీంతో అతని తొలి ప్రపంచకప్ కలతో పాటు కెరీర్, జీవితం అన్ని మూలనపడ్డాయి. ఊపిరే కష్టమంటే… చివరకు కొన్ని రోజులు కోమాలో, ఇంకొన్ని రోజులు పక్షవాతానికి గురైన అతన్ని డాక్టర్లు నడవలేడని తేల్చేశారు.
ప్రాణాపాయమైతే తప్పింది కానీ…ఊపిరి ఉన్నంతవరకు మంచమే దిక్కని డాక్టర్లు చెప్పారు. దీంతో జర్మనీలో మైదానంలో ప్రత్యర్థులతో తలపడాల్సిన సందీప్… ఇంట్లో మంచంపై ఒంటరితనంతో పోరాడాల్సి వచ్చింది. ప్రతికూల ఆలోచనలతో తల్లడిల్లిపోయేవాడు. కానీ అతనిలోని నేర్పరితనం… ఆటలో అలవడిన సుగుణం… వేగంగా ఎదిగేలా చేసిన వైనం… ఇవన్నీ అతని గాయన్ని మాన్పించాయి. మళ్లీ ఆడాలన్న పట్టుదల తిరిగి హాకీ స్టిక్‌ను పట్టించింది. రెండంటే రెండేళ్లలోనే మైదానంలోకి దిగేలా చేసింది.
ఇక సందీప్ నడవలేడన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా అతను భారత జట్టునే ఒలింపిక్స్‌కు నడిపించాడు. ఇలా అతని ఆట, ఒలింపిక్స్ బాట సంచలనంగా మారిపోయింది. 2008లో అజ్లాన్ షా కప్‌లో ఆడాడు. ఆడటమే కాదు తొమ్మిది గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో 12 ఏళ్ల తర్వాత భారత్‌ను విజేతగా నిలిపిన ఘనత కచ్చితంగా సందీప్‌దే. భారత కెప్టెన్‌గా పలు టోర్నీల్లో విజయవంతమైన ఈ డ్రాగ్‌ఫ్లికర్… భారత్‌ను 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేలా కీలకమైన గోల్స్ చేశాడు. ఈ మెగా టోర్నీ కోసం ఫ్రాన్స్‌తో జరిగిన ఆఖరి క్వాలిఫయర్ పోరులో భారత్ 9–1తో ఏకపక్ష విజయం సాధించింది.
ఇందులో సందీప్ సింగ్ ఏకంగా ఐదు గోల్స్ చేయడం గమనార్హం. కెరీర్ మొత్తంలో వందకంటే ఎక్కువ గోల్స్ చేసిన సందీప్ 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత హాకీ ఇండియా లీగ్‌లో ముంబై మెజీషియన్స్, పంజాబ్ వారియర్స్, రాంచీ రేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సందీప్ సింగ్ కెరీర్‌పై 2018లో బాలీవుడ్‌లో ‘సూర్మా’ పేరుతో సినిమా కూడా నిర్మించారు. హరియాణా పోలీసు విభాగంలో ఐదేళ్లపాటు డీఎస్పీగా పనిచేసిన 34 ఏళ్ల సందీప్ గతేడాది రాజకీయాల్లోకి వచ్చాడు. బీజేపీ తరఫున హరియాణాలోని పెహోవా నియోజకవర్గం నుంచి పోటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం రాష్ట్ర మంత్రి వర్గంలో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.