ఆప్గనిస్తాన్‌లో తాలిబన్లు పరిపాలన ఏమోగానీ తమ నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విదేశీ కరెన్సీపై తాలిబన్లు నిషేధం విధించారు. దీంతో ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉండగా , ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత జఠిలంగా తయారుకానుంది.
తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్గనిస్తాన్ వెళ్లినప్పటినుంచి అంతర్జాతీయ సమాజం తాలిబాన్ల పరిపాలనను ప్రభుత్వంగా గుర్తించడానికి నిరాకరించింది. మరో వైపు ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో బ్యాంకులు నగదు కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశానికి కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు పరిపాలనంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, దేశాన్ని అభివృద్ధి వైపు నడపడం లాంటివి గాక కేవలం తమకు తెలిసిన రాక్షస పాలన, ఏకాధిపత్య నిర్ణయాలను మాత్రమే అనుసరిస్తూ వస్తున్నారు తాలిబన్లు.
ఈ పరిస్థితిలో స్వదేశీ వ్యాపారం కోసం విదేశీ కరెన్సీ వాడే వారిని శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలుపుతూ ప్రజలకు మరో షాక్ ఇచ్చారు. దేశంలో ఆర్థిక పరిస్థితి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆఫ్గన్‌లందరూ ఇకపకై ప్రతి లావాదేవీలను ఆఫ్గనిస్తాన్ కరెన్సీలోనే చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపాడు.