కాబుల్: మహిళల విద్య పై అఫ్గానిస్థాన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లకు ప్రజలు దూరం కావడానికి మహిళల విద్యపై ఆంక్షలు విధించడమే కారణమని తెలిపారు. ఈ మేరకు అఫ్గానిస్థాన్ సరిహద్దు మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల కోసం నిర్వహించిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని టోలో అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. బాలికల విద్య కోసం పాఠశాలను తిరిగి తెరవాలని, జ్ఞానం లేని సమాజం చీకటితో సమానమని అబ్బాస్ అన్నారు. ‘‘విద్య ప్రతి ఒక్కరి హక్కు . దేవుడు ప్రజలకు కల్పించిన సహజమైన హక్కు . దానిని ప్రజల నుంచి ఎవరైనా ఎలా దూరం చేయగలరు? దీనిని ఎవరైనా అతిక్రమిస్తే.. అది అఫ్గానిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే. విద్యాసంస్థలను తిరిగి అందరి కోసం తెరిచేందుకు ప్రయత్నించాలి. చదవుపై ఆంక్షల కారణం గానే పొరుగు దేశాలు మనకు దూరం అవుతున్నాయి. మన వల్ల (తాలిబన్లు) దేశం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే.. అందుకు ఇదే కారణం ’’ అని అబ్బాస్ వ్యాఖ్యానించారు.
రెండేళ్ల క్రితం అఫ్గానిస్థాన్లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి, తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలో మహిళలు, బాలికలపై పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా దేశంలోని బాలికలు ఆరో తరగతికి మించి చదవాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మహిళల విద్యపై తాలిబన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.