దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని ఓ హాస్పిటల్ మీద తాలిబాన్లు పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కుతో దాడి చేసారు. అందులో 20 మంది చనిపోయారు.ఖలాత్ నగరంలో జరిగిన ఈ దాడిలో చనిపోయినవారు, గాయపడిన వారిలో ఎక్కువ మంది డాక్టర్లు, రోగులేనని స్థానిక మీడియా తెలిపిది.ఆ తరువాత తూర్పు ప్రాంతంతోల ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా చేసిన వైమానిక దాడిలో 16 మంది చనిపోయారని, వారిలో చాలా మంది సామాన్య పౌరులేనని అధికారులు తెలిపారు.
ఖలాత్ నగరంలోని ఒక హాస్పిటల్ వద్దకు భారీ పేలుడు పదార్థాలతో నిండిన ‘మినీ ట్రక్కు’ను తీసుకొచ్చి పేల్చేశారని రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.జాబుల్ ప్రాంతంలో చాలా మందికి వైద్య సేవలు అందించే ఈ ఆస్పత్రి పూర్తిగా విధ్వంసమైందని గవర్నర్ రహమతుల్లా యమాల్ చెప్పారు.తాలిబాన్లు మాత్రం, తాము హాస్పిటల్ పక్కన ఉన్న ప్రభుత్వ ఇంటలిజెన్స్ వర్గాలను టార్గెట్ చేశామని ప్రకటించారు.గురువారం ఉదయం జరిగిన ఈ దాడిలో మొత్తం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియలేదు. అయితే, జాబుల్ డిప్యూటీ గవర్నర్ చెప్పిన ప్రకారం 20 మంది చనిపోయారు, మరో 90 మంది గాయపడ్డారు.