భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఆర్నెళ్లు దాటినా ఇంకా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు… ఇలా తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. తాజాగా హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడ్డారు. ఆ మధ్య తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా వారు కోలుకున్నారు. తాజాగా తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిసింది.
ఓ సినిమా షూటింగ్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్ చేరుకున్నారు. అధిక జ్వరంతో బాధపడుతున్న తమన్నా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు తెలుగు చిత్రాలున్నాయి. వాటిలో ‘గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధాధూన్’ ఉన్నాయి. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నారు తమన్నా.