Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న ‘క్వీన్’ చిత్రంను సౌత్‌లో నాలుగు భాషల్లో రీమేక్ చేసేందుకు గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం నాలుగు భాషలకు సంబంధించిన రీమేక్ మొదలైంది. ఒకే సారి నాలుగు భాషల్లో సినిమాను రీమేక్ చేస్తున్న కారణంగా అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ముఖ్యంగా తెలుగులో క్వీన్ రీమేక్ నుండి దర్శకుడు తప్పుకున్నాడు. తన పనిలో ఇతరులు వేలు పెడుతున్నారనే ఆగ్రహంతో దర్శకుడు నీలకంఠ తప్పుకున్నాడు. తెలుగు క్వీన్‌గా తమన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇటీవలే తెలుగు క్వీన్‌ను మళ్లీ మొదలు పెట్టేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘అ!’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మకు క్వీన్ రీమేక్ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. నాని నిర్మించిన ‘అ!’ చిత్రంతో ప్రశాంత్ వర్మకు మంచి పేరు వచ్చింది. ఒక చిన్న చిత్రంగా మొదలైన ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈయనకు పలువురు యువ హీరోల నుండి పిలుపు వచ్చింది. కాని ఈయన మాత్రం క్వీన్ రీమేక్‌ను నెత్తికి ఎత్తుకున్నాడు. మద్యలో ఆగిన క్వీన్‌ను ఈయన పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కొత్త దర్శకుడి, ప్రతిభ ఉన్న దర్శకుడికి రీమేక్ చేయాల్సిన అవసరం లేదు. కాని ఈయన ఎందుకు ఈ రీమేక్ బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నాడు అనే విషయం మాత్రం తెలియడం లేదు.