నటుడు వడివేలు బాలాజీ (45) గురువారం చెన్నైలో కన్నుమూశారు. మదురై పూర్వీకం కలిగిన బాలాజి మిమిక్రీ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న కలక్క పోవదు యార్ కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం పొందారు. ఈయన న టుడు వడివేలును అనుకరిస్తూ హాస్యాన్ని పండించడంతో వడివేలు బాలాజీగా పాపులర్ అయ్యారు.
పలు టీవీ కార్యక్రమాల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బాలాజీ కోలమావు కోకిల వంటి కొన్ని చిత్రాల్లోనూ నటించారు. కాగా 15 రోజుల క్రితం గుండెపోటు, పక్షవాతానికి గురైన వడివేలు బాలాజి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన తర్వాత స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ వడివేలు బాలాజి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.