తమిళ యువ నటుడు తెన్నారసు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని మైలాపూర్‌లో మంగళవారం తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భార్యతో ఘర్షణకు దిగిన అనంతరం తీవ్ర మనస్తాపానికి లోనై అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మూడేళ్ల క్రితం తెన్నారసు తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉంది.
తాగుడుకు అలవాటు పడ్డ నటుడు భార్యతో తరచూ గొడకు దిగుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఇదిలా వుండగా తెన్నారసు హీరో శివకార్తికేయన్ నటించిన ‘మెరీనా’ చిత్రంలో నటించారు. ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించగా అది అతనికి మంచి పేరును తెచ్చిపెట్టింది. తెన్నారసు పలు సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రలోనే ఎక్కువగా కనిపించారు.