జయలలితకు హల్వా తినిపించి చంపేశారా ?

tamil minister alleges that sasikala killed amma by halwa

తమిళనాడు ప్రజలు ప్రేమగా అమ్మ అని పిలుచుకునే దివంగత ముఖ్యమంత్రి జయలలిత లోకం విడిచి రెండేళ్లు దాటినా ఆమె మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆమె మరణం వెనుక మిస్టరీపై విచారణ జరుగుతున్న తరుణంలో, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు హల్వాను తినిపించి హత్య చేశారని ఆరోపించారు. అమ్మది ముమ్మాటికి హత్యేనని తెలుపుతూ విచారణ సక్రమంగా జరిగితే, అన్ని వాస్తవాలూ బయటకు వస్తాయని తెలిపారు. జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణ జరుపుతున్న వేళ, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్‌ ఇచ్చిన వాంగ్మూలం అవాస్తవమని, ఆయన కమిషన్ ముందు అబద్ధాలు చెప్పారని షణ్ముగం విరుచుకుపడ్డారు.

చివరి రోజుల్లో జయలలితకు చికిత్స చేసిన అపోలో యాజమాన్యానికి అనుకూలంగా రాధాకృష్ణన్‌ వ్యవహరిస్తున్నారని, కొందరిని రక్షించే ప్రయత్నం ఆయన చేస్తున్నారని తెలిపారు. జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెను చూసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదని, శశికళ ఎప్పుడూ మమ్మల్ని అనుమతించలేదని జయలలితకు షుగర్ వ్యాధి ఉందని తెలిసి కూడా ఆస్పత్రిలో ఆమెకు హల్వా తినిపించారు. అమ్మకు వ్యాధి ముదిరి సహజంగా చనిపోవాలన్న దురుద్దేశంతోనే శశికళ ఇలా చేసిందని అన్నారు. కోలుకుంటున్న సమయంలో జయలలితకు కార్డియాక్ అరెస్ట్ ఎలా వస్తుంది ?. ఒకవేళ వస్తే ఆస్పత్రి బాల్కనీలో రక్తం ఎలా చిందింది?. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది?. సరైన పద్ధతిలో శశికళను విచారిస్తే అమ్మ మృతిపై నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని మంత్రి అన్నారు. రెండాకుల గుర్తును నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి కలలు ఫలించవంటూ టీటీవీ దినకరన్‌ను ఉద్దేశించి షణ్ముగం వ్యాఖ్యానించారు. జయలలితకు మధుమేహం ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని, చివరి క్షణంలో గుండెపోటు వచ్చే విధంగా పరిస్థితి మారే రీతిలో హల్వా తినిపించినట్లు ఆరోపించారు.