జగన్ సాయం కోరిన తమిళ మంత్రులు

tamil-ministers-seeking-help-from-pagan

తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాయం కోరింది. చెన్నై ప్రజల దాహర్తిని తీర్చాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరింది. ఈ మేరకు శుక్రవారం తమిళనాడు మంత్రులు అమరావతిలో సీఎంను కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. తాగునీటి కోసం చెన్నై ప్రజలు అల్లాడిపోతున్నారని వారిని ఆదుకోవాలని కోరారు.

తాగడానికి నీళ్లులేక 90లక్షల మంది కష్టాలుపడుతున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలన్నారు. తమిళనాడు మంత్రుల విజ్ఞ‌ప్తిపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు.

తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది ప్రజల కోసం మానవత్వంతో స్పందించి చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదర భావంతో మెలగాలని తమిళనాడు మంత్రులతో జగన్ అన్నారు.

ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలని అన్నారు. చెన్నైకు నీళ్లు విడుదల చేసేందుకు జగన్ సానుకూలంగా స్పందించడంతో.. తమిళనాడు మంత్రులు ఏపీ ముఖ్యమంత్రికి కృతజ్ఞ‌తలు తెలిపారు. జగన్‌ను కలిసినవారిలో తమిళనాడు మున్సిపల్‌ శాఖ మంత్రి గణేశన్.. మత్స్య, పాలనా సంస్కరణల శాఖ మంత్రి జయకుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మనివాసన్‌ ఉన్నారు.