రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఉద్ధృతి పెరిగింది. గత ఐదురోజులుగా రోజుకు 14 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం కలవరం రేపుతోంది. చెన్నైలో 4072 వీధుల్లో కరోనా వ్యాప్తి చెందింది. ఇందులో 300 మేరకు వీధుల్ని కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి తెచ్చారు. నైట్ కర్ఫ్యూను ఈనెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యం మినహా తక్కిన కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, 10,12 తరగతుల విద్యార్థులకు మాదిరి పరీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇక, నైట్కర్ఫ్యూను పొడిగిస్తూ సోమవారం రాత్రి వెలువడ్డ ప్రకటనలోని కొన్ని అంశాల మేరకు సంక్రాంతి తదుపరి రాష్ట్రంలో ఫుల్ లాక్డౌన్ అమలయ్యే అవకాశాలు అధికంగానే ఉంటాయన్న చర్చ ప్రారంభమైంది. దీంతో తమ ఆర్థిక పరిస్థితులపై ఆందోళన ప్రజల్లో పెరిగింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు స్వస్థలాలకు క్యూకట్టారు. కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్ తదితర జిల్లాల్లోని వస్త్ర, ఇతర పరిశ్రమల్లోని కార్మికుల్లో లాక్డౌన్ ఆందోళన కలవరపరిచింది.