రాష్ట్రాన్ని భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. కుంటల నుంచి జలాశయాల వరకు అన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. రోడ్లు, పంట పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరు చేరి అల్లాడుతున్నారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక సీఎం స్టాలిన్ సహా.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విపక్ష నాయకులు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
సాక్షి, చెన్నై: ఏటా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న ప్రాంతం కడలూరు. ఈ ఏడాదీ ఇక్కడి ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి ప్రస్తుతం కడలూరు దీవిని తలపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే చాలు అది రాష్ట్రం వైపుగా చొచ్చుకు వస్తుందంటే, అది కడలూరు సమీపంలో తీరం దాటాల్సిందే. ఇది ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న పరిణామం. ప్రస్తుతం కూడా ఇక్కడి ప్రజల్ని వాయుగుండం వెంటాడుతోంది. ఇక్కడున్న ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 300 చెరువులు 75 శాతానికి పైగా నిండి ఉన్నాయి.
నీటి పరవళ్లతో పంట పొలాలు, రోడ్లు కనిపించని పరిస్థితి. ఎటు చూసినా నీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక్కడి ఎన్‌ఎల్‌సీ లిగ్నైట్ కార్పొరేషన్‌లోని బొగ్గు గనుల నుంచి వెలువడే నీటికి వరదలు తోడయ్యాయి. దీంతో పరిసర గ్రామాల మధ్య సంబంధాలు కరువైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. విల్లుపురం, కళ్లకురిచ్చి, నాగపట్నం జిల్లాల నుంచి సైతం వరదలు ఇటు వైపుగా పోటెత్తుతుండంతో సాయం కోసం కడలూరు వాసు లు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక డెల్లా జిల్లాల్లో సంబా పంటపై వరుణుడు ప్రతాపం చూపుతున్నా డు. పుదుకోట్టై, తిరువారూర్, తంజావూరు జిల్లాల్లో వరి పంటను ముంచేస్తూ వరదలు పోటెత్తుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.