సౌత్ ఇండియా అంతటా మంచి ఫాలోయింగ్ ఉన్న, ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు ఉన్నట్లుండి తమిళ ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఇందుక్కారణం విజయ్ సేతుపతి శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాత్ర చేయబోతుండటమే. నిన్ననే ఈ చిత్ర టైటిల్, అలాగే మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు.
విజయ్ సేతుపతి చొక్కా మీద శ్రీలంక జెండా కనిపించడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వేలాది మంది తమిళుల ప్రాణాలు తీసి, వారి జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన శ్రీలంక దేశ జెండాను విజయ్ తన చొక్కాపై ధరించడం వారికి నచ్చలేదు. అలాగే స్వతహాగా తమిళుడైనప్పటికీ.. ఎప్పుడూ తమిళులపై జరిగిన అకృత్యాలపై నోరు విప్పకుండా, ప్రభుత్వం వైపే నిలిచిన మురళీ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటించడం కూడా వారికి నచ్చలేదు.
మరీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటుంఉదని చిత్ర బృందం ఊహించినట్లు లేదు. భారీ బడ్జెట్లో అంతర్జాతీయ సినిమాగా 800ను రూపొందించడానికి సన్నాహాలు చేసుకున్న టీంకు ఇది మింగుడు పడని విషయమే. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ దార్ ఫిలిమ్స్ భయపడిపోయి వెంటనే స్పందించింది.
ఈ సినిమాలో క్రికెటర్‌గా మురళీధరన్ జీవితాన్ని చూపిస్తాం తప్ప.. పొలిటికల్ స్టేట్మెంట్ లాంటిదేమీ ఉండదని, రాజకీయాలతో ఈ సినిమాకు అసలేమాత్రం సంబంధం ఉండనది స్పష్టం చేస్తూ ఒక ఖండన విడుదల చేసింది. అంతే కాదు.. శ్రీలంకలోనే పలువురు తమిళులు ఈ సినిమాలో భాగం అవుతున్నారని, వారి టాలెంట్ ప్రపంచానికి తెలుస్తుందని పేర్కొంది. మరి ఈ వివరణతో తమిళులు ఏమేరకు సంతృప్తి చెంది సినిమా పట్ల వ్యతిరేకతను దాచుకుంటారో చూడాలి.