Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించగానే ఆయన ఫాన్స్ కన్నా ఎక్కువ ఖుషీ అయిపోతోంది బీజేపీ. ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఓ అడుగు ముందుకు వెళ్లి రజని కి బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఆయన రాజకీయాల్లో మా వాడే అని చెప్పడానికి తహతహలాడారు. రజని మీద బీజేపీ అలా తన వన్ సైడ్ లవ్ ని ప్రకటించేసింది . కానీ పార్టీ ప్రకటన సమయంలోనే అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పడం ద్వారా రజని పొత్తులకు ఛాన్స్ లేదని చెప్పకనే చెప్పారు . ఇక తమిళ ప్రజలు బీజేపీ అంటేనే రుసరుసలాడుతున్నారు. జయ మరణం దగ్గర నుంచి అక్కడ పాగా వేయడానికి ఆ పార్టీ వేసిన ఎత్తులు ఒక్కటి కూడా పారలేదు. శశికళ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నో ఐటీ దాడులు జరిపింది. పన్నీర్ సెల్వం ని సీఎం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆయనకు ఎన్నో అవకాశాలు కల్పించింది. కానీ శశి అనుకున్నట్టే పళనిస్వామిని సీఎం చేయగలిగింది. ఆపై పళనిస్వామిని శశికి దూరం చేసిన బీజేపీ తాను అనుకున్న ఫలితాలు అన్నాడీఎంకే తో రావని అర్ధం చేసుకుంది.
అన్నాడీఎంకే ని అక్కడే వదిలేసి డీఎంకే మీద ప్రేమ పెంచుకుంది. ప్రధాని మోడీ ఏకంగా కరుణానిధి ఇంటికెళ్లి మరీ ఆయన్ని పరామర్శించారు. అంతవరకు మర్యాద అనుకోవచ్చు. అంత కుటుంబం వున్న కరుణని పట్టుకుని ఢిల్లీ వచ్చి ప్రధాని భవనంలో రెస్ట్ తీసుకోమనడం మాత్రం కాస్త అతిగా అనిపించింది. ఇంతలో 2 జి కేసు తీర్పు వచ్చింది. డీఎంకే నేతలు నిర్దోషులు అన్న తీర్పుతో బీజేపీ ఏమి అనుకుందో గానీ తమిళులతో పాటు మొత్తం దేశానికి చాలా విషయాలు అర్ధం అయ్యాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల తీర్పుతో బీజేపీ కి దగ్గరైతే ఏమి జరుగుతుందో డీఎంకే కి బాగా అర్ధం అయ్యింది. అందుకే సైలెంట్ గా సైడ్ అయిపోతోంది. బీజేపీ అయ్యో అనుకునేలోపే రజని రంగంలోకి దిగేసారు. ఇంకేముంది రెచ్చిపోయి వన్ సైడ్ లవ్ బయటపెట్టేసింది బీజేపీ. కానీ రజని కి ఆ పార్టీ తో అంటకాగే ఉద్దేశం లేదట. అయినా రజని ని బీజేపీ అంత తేలిగ్గా వదిలేట్టు లేదు. అయినా తమిళ రాజకీయాల్లో బీజేపీ ఇంతమందిని ఎలా ప్రేమిస్తుందో ? ఇంత మంది కాదన్నా ఎలా తట్టుకుంటుందో పాపం.