పతివ్రత అన్న సర్టిఫికెట్ తో వచ్చిందా? : హరితేజ ఇష్యూ మీద తమ్మారెడ్డి ఫైర్

Tammareddy Bharadwaj reacts on Actor Hari Teja Theater Issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఓ సినిమా థియేటరులో తనకు ఎదురైన అనుభవాన్ని కన్నీరు పెట్టుకుంటూ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితీ ఈ విషయం మీద మేమంతా ఒక్కటే అని చెప్పుకునే సినీ పెద్దలు ఎవరూ స్పందించక పోగా ఇప్పుడు సినిమా పెద్దల్లో ముఖ్యులైన తమ్మారెడ్డి భరధ్వాజ తీవ్ర స్థాయిలో స్పందించారు. హరితేజ వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం, ఇటీవల ‘మహానటి’ సినిమా చూసేందుకు తన తండ్రి, తల్లి, చెల్లెలుతో హరితేజ థియేటర్ కు వెళ్లింది. ఇంటర్వెల్ తరువాత, వారు సీట్లు మారారు. దీంతో వీరి పక్కన కూర్చున్న తల్లీ కూతుళ్లు హరితేజ కుటుంటంతో వాగ్వాదానికి దిగారు. తన కుమార్తె పక్కన హరితేజ తండ్రి కూర్చోరాదని వాదించిన సదరు తల్లి, మీ నాన్న పక్కన కూర్చోడానికి తన కుమార్తె ఇబ్బంది పడుతోందని, మగాళ్ల పక్కన కూర్చోడానికి తామేమీ సినిమా వాళ్లం కాదని చెప్పింది.

ఈ మాటలతో బాధ పడ్డ హరితేజ, తాను ఎదుర్కొన్న ఘటనపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇక దీన్ని చూసిన నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ తీవ్రంగా స్పందించారు. సదరు ప్రేక్షకురాలేమైనా పతివ్రత అన్న సర్టిఫికెట్ తో థియేటర్ కు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీని చాలా చులకనగా చూడడం ఎక్కువైపోతోందని కొందరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కడుపు రగిలిపోతోంది, రెండు పీకాలని కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరిలాగే హరితేజ ఫ్యామిలీ టికెట్టు కొనుక్కుని సినిమాకు వెళితే అవమానించడం ఏంటని మండిపడ్డారు. సినిమా వాళ్ళ లాగా మగోళ్ల పక్కన మా పిల్లలు కూర్చోరు అని మాట్లాడడం ఎంత దారుణం బస్సులో, రైల్లో, విమానాల్లో ప్రయాణించే సమయంలో మీరు మంచి వారేనా అని అడిగి కూర్చుంటారా. ఆ సంధర్భంలో మీ పక్కన కూర్చున్న వారంతా మంచి వారే అని గ్యారెంటీ ఇవ్వగలరా.

అసలు ముందు మీరెలాంటి వారు అని మేము అడిగామా అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. హరితేజ సినిమా సెలెబ్రిటీ కాబట్టి గుర్తు పట్టి మరి ఆ మాట అన్నారు. సినిమా వాళ్లంతా చెడ్డవాళ్ళు అనే ముద్ర, సర్టిఫికెట్ ఇచ్చేశారు సరే మీరు మంచి వారా కాదా అనే సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు. ఈ సారి థియేటర్ కు వచ్చేముందు సర్టిఫికెట్ తీసుకుని వచ్చి మా పక్కన కూర్చోండని తమ్మారెడ్డి అన్నారు. సినిమా వాళ్ళు కూడా అందరి లాంటి మనుషులే సమాజంలో చెడ్డవారు ఉన్నట్లే సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత మంది చెడ్డవారు ఉండే అవకాశం ఉందని అన్నారు. అంత మాత్రానికే అవమానంగా మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. తన మాటలు బాధపెడితే క్షమించాలని అంటూనే, సినిమావాళ్లను చిన్న చూపుచూడవద్దని, వారూ మామూలు మనుషులేనని, తాము ప్రేక్షకులను దేవుళ్లుగా చూస్తామని చెప్పుకొచ్చారు.