ఆ సినిమాలు రాత్రి ప‌దిగంట‌ల త‌ర్వాత వేయాలంటారు… మ‌రి గ‌జ‌ల్ వీడియోల సంగ‌తేంటి…?

Tammareddy Bharadwaja about Anchor Pradeep and Ghazal Srinivas
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మీడియాపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. యాంక‌ర్ ప్ర‌దీప్, గ‌జ‌ల్ శ్రీనివాస్ వ్య‌వ‌హారాల్లో మీడియా వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయ‌న న్యూస్ చాన‌ళ్ల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. కొత్త సంవ‌త్స‌రం కొత్త విష‌యాలు మాట్లాడాల‌ని అనుకున్నాన‌ని, కానీ కొత్త‌వేవీ క‌న‌బ‌డ‌డం లేద‌ని అన్నారు. నూత‌న ఏడాదిలో మంచి జ‌రుగుతుంది అనుకుంటే మంచి కంటే చెడు ఎక్క‌వ జ‌రిగింద‌ని, చెడు అంటే చెడు కాద‌ని, చెడులాంటిద‌ని భ‌ర‌ద్వాజ విశ్లేషించారు. డ్రంకెన్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డ్డ ప్ర‌దీప్ గురించి ప‌దే ప‌దే ఎందుకు చూపించార‌ని ప్ర‌శ్నించారు. అలాగే గ‌జ‌ల్ శ్రీనివాస్ కేసు విష‌యంలోనూ మీడియా నైతిక విలువ‌లు పాటించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. గ‌జ‌ల్ శ్రీనివాస్ ను ప‌ట్టుకున్నార‌ని, త‌ప్పుచేశాడ‌ని జైలుకు పంపించార‌ని… ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంద‌ని, అయితే గ‌జ‌ల్ వీడియోల‌ను అదే ప‌నిగా ఎందుకు చూపిస్తున్నార‌ని త‌మ్మారెడ్డి ప్ర‌శ్నించారు.

ఏ స‌ర్టిఫికెట్ సినిమాల‌ను రాత్రి ప‌దిగంట‌ల త‌ర్వాత ప్ర‌సారం చేయాల‌ని అంటార‌ని, కానీ న్యూస్ చాన‌ళ్లు మాత్రం ప‌గ‌లూ రాత్రి తేడా లేకుండా గ‌జ‌ల్ వీడియోల‌ను చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌గ‌లూ, రాత్రి న్యూస్ ప్ర‌సారం చేయ‌వ‌చ్చు కానీ ఇలాంటి వీడియోలు ప్ర‌సారం చేయ‌వ‌చ్చా అని అడిగారు. తాను ఏద‌న్నా చెబితే మీడియాకు చెప్పేటంత పెద్ద‌వాడివి అయిపోయావా, నువ్వు చెప్పిన‌ట్టు మీడియా న‌డ‌వాలా అంటార‌ని, తాను చెప్పిన‌ట్టుగా మీడియా న‌డ‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాము కాబ‌ట్టి మీడియా స్వ‌తంత్ర‌త మీడియాకు ఉంటుంద‌ని, అదే స‌మ‌యంలో నైతిక విలువ‌లు పాటించాల్సిన బాధ్య‌త కూడా మీడియాపై ఉంద‌ని, అది విస్మ‌రించ‌కూడ‌ద‌ని త‌మ్మారెడ్డి హిత‌వుప‌లికారు. మీడియా ఎలా ప్ర‌వ‌ర్తించాల‌ని చెప్ప‌డం త‌న ఆలోచ‌న కాద‌న్నారు. అసాంఘిక కార్య‌క‌లాపాల‌ను ఎలా అరిక‌ట్టాలో చెప్ప‌డం మీడియా బాధ్య‌త‌ని, అంతే త‌ప్ప ఆ సంఘ‌ట‌న‌ల‌ను అదే ప‌నిగా ఇలా జ‌రిగింద‌ని చూపెట్ట‌డం స‌బ‌బు కాద‌ని అన్నారు. మీడియా వైఖ‌రి వ‌ల్ల ఇలాంటి వాటి గురించి తెలియ‌ని వాళ్లు తెలుసుకునే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రించారు.