తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ సూత్రధారిగా తేలింది. చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితేనే రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉంటుందని, పాస్ కాని వారి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన కుమార్ సర్టిఫికెట్లు జారీ చేశాడని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.
జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కసరమోని శివానంద్, కర్మన్‌ఘాట్ వాసి తోట దిలీప్ కుమార్ స్నేహితులు. వీరు చైనాలో ఎంబీబీఎస్ చదివారు. 2012లో సర్టిఫికెట్ పొంది తిరిగి వచ్చారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు ఇక్కడ ప్రాక్టీసు చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులు కావాలి.
అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షను ఎంసీఐ ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ ద్వయం 2012–14 మధ్య రెండుసార్లు పరీక్షకు హాజరైనా ఉత్తీర్ణులు కాలేదు. పాస్ అయితే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. దీంతో వీళ్లిద్దరూ ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించారు. వీరికి ఓ స్నేహితుడు ద్వారా టీఎస్‌ఎంసీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అనంతకుమార్‌తో పరిచయమైంది. 2017లో అతడిని కలిసి తమ అవసరాన్ని చెప్పారు.
దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన అనంతకుమార్ 2016లో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లు వీరికి కేటాయించాడు. ఈ మేరకు టీఎస్ఎంసీ డేటాబేస్‌లో మార్పుచేర్పులు చేసి, వీరిద్దరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. ఇటీవల అసలు వైద్యులు రెన్యువల్, అర్హతలు అప్డేట్ కోసం టీఎస్ఎంసీకి రావడంతో విషయం తెలిసింది.
టీఎస్ఎంసీ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని టీమ్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది.
వీరి వద్ద నకిలీ టీఎస్ఎంసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ… ఎంసీఐ సర్వర్‌లో మాత్రం ఎంటర్ కాలేదు. దీంతో అందులో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలే కనిపిస్తున్నాయి. చిక్కుతామని భయపడిన వీరు ప్రాక్టీసు చేయకుండా వైద్య సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. అనంతకుమార్ వీరిద్దరితో పాటు శ్రీనివాస్, నాగమణిలకు ఈ తరహాలో సహకరించినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వారి వివరాలు ఆరా తీస్తున్నామన్నారు. శివానందం 2012–16 మధ్య, దిలీప్ 2016 –18 మధ్య సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్యూ టీ డాక్టర్లుగా పని చేశారు. టీఎస్ఎంసీ సర్టిఫికెట్ లేని శివానందంకు ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరు మెడికల్ కంపెనీలో, మరొకరు వైద్యులకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.