టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు వ్యవహారం అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్‌తో మొదలైన ఈడీ విచారణ.. తనీష్ వరకు కొనసాగింది. ఇంకా తరుణ్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే తనీష్ మీద ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే కెల్విన్, ఎఫ్ క్లబ్ పార్టీలకు సంబంధించిన ప్రశ్నలతో తనీష్‌ను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 17) ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న తనీష్ సాయంత్రం వరకు విచారణను ఎదుర్కొన్నారు.
డ్రగ్స్ కేసుకు సంబంధించి అతనిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. ముఖ్యంగా కెల్విన్, జీషాన్‌తో సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. కెల్విన్‌తో ఉన్న లింక్‌లు ఏంటి? జీషాన్‌తో సంబంధాలేంటి? జీషాన్ కాంటాక్ట్ లిస్ట్‌లో తనీష్ పేరు ఎందుకుంది? బ్యాంక్ ట్రాన్సక్షన్స్ ఏ విధంగా సాగాయి? ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది? ఇలా 8 గంటల పాటు సినీ నటుడు తనీష్‌ను ఈడీ అధికారులు విచారించారు.
మనీలాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘనపై ఆరా తీశారు. ఇప్పటివరకు పూరీ మొదలు ముమైత్ ఖాన్ వరకు సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. కెల్విన్‌తో లింకులు, ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీ, బ్యాంక్ ట్రాన్సక్షన్స్ పైనే ఈడీ విచారణ కొనసాగుతోంది. ఎఫ్ క్లబ్ లాంజ్‌లో జరిగిన పార్టీలో తనీష్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో దీని గురించి ఈడీ అధికారులు కూపీలాగారు. ఇక తరుణ్ సెప్టెంబర్ 22న ఈడీ ముందు హాజరు కానున్నాడు.