కథానాయికలు నిర్మాతలుగా మారడం ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. మొన్న అనుష్క శర్మ, నిన్న ప్రియాంక చోప్రా నిర్మాతలుగా మారి సినిమాలు తీసి హిట్టందుకోగా తాజాగా తాప్సీ పన్ను కూడా సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టింది. “అవుట్‌సైడర్ ఫిలింస్” పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది.
సూర్మా, పీకు వంటి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రంజల్ ఖాందియాతో కలిసి తన సంస్థ నుంచి సినిమాలు తీయనున్నట్లు వెల్లడించింది. తప్పకుండా మంచి కంటెంట్‌తో ముందుకు వస్తానంటూ సోషల్ మీడియా వేదికగా గురువారం నాడు అభిమానులకు హామీ ఇచ్చింది తాప్సీ. నిర్మాతగా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నానని ఇందుకు మీ ఆశీర్వాదాలు కావాలంటూ ఎమోషనల్ లేఖ రిలీజ్ చేసింది.
అయితే ఆమె తన నిర్మాణ సంస్థకు ‘అవుట్‌సైడర్ ఫిలింస్’ అని పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ ‘అవుట్‌సైడర్స్’, ‘నెపోటిజం’ పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అవుట్‌సైడర్స్(బయటివాళ్ల)కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వరని, సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినవాళ్లను మాత్రం అందలం ఎక్కిస్తారని విమర్శలు వస్తుంటాయి. ఈ క్రమంలో తాప్సీ అవుట్ సైడర్ అనే పేరును ఎంచుకోవడాన్ని చూస్తుంటే ఆమె కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.