ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఈరోజు మొదటి సారిగా టీడీఎల్పీ భేటీ కానుంది. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో టీడీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు టీడీపీ నేతలు. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఉంటారా లేక వేరే వారికి అవకాశం కల్పిస్తారా అనేది తేలిపోనుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం చవిచూసింది. కేవలం 23 స్థానాల్లో మాత్రం గెలవగలిగింది. అందులో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే 11 మంది ఉండగా ముగ్గురు కాపులు, ఆరుగురు బిసిలు, ఒకరు ఎస్సీ, ఒకరు క్షత్రియ, మరొకరు వైశ్య సామాజిక వర్గం వ్యక్తి ఉన్నారు. ఇక టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో ఈ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటనేది కూలంకషంగా చర్చించనున్నారు. ఇక ఎవరిని ఎల్పీ నేతగా ఎన్నుకోబోతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మామూలుగా అయితే శాశనసభాపక్ష నేతగా చంద్రబాబే ఉంటారు. కానీ ఈసారి ఫలితాలు చాలా దారుణంగా రావడంతో ఆయన ఉంటారా లేక వేరే ఎవరికైనా అవకాశం ఇస్తారా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. టీడీఎల్పీ నేతగా ఒకవేళ చంద్రబాబు ఉండకపోతే ఆ స్దానంలో ఎవరు ఉంటారు అనేది ఈరోజు తేలనుంది. ఎన్నికల్లో గెలిచిన 23 మందిలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. కరణం బలరామ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు వంటి సీనియర్ నేతలు ఉన్నారు. బీసీ వర్గాలకు ఆ పదవి ఇవ్వాలనుకుంటే అచ్చన్న కరెక్ట్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేదా కాపు వర్గానికి చెందిన వారికి ఇవ్వాలనుకుంటే చినరాజప్ప పేరు వినిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుండి చూసుకుంటే కరణం బలరాం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ల పేర్లు వినిపిస్తున్నాయి.