మళ్ళీ తెలుగు-సేనల మధ్య పొత్తు పొడుస్తోందా…?

TDP Alliance With Janasena Party

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన వైపు చూస్తున్నారా ? మళ్లీ తెలుగుదేశం పార్టీతో జనసేన జట్టు కట్టడానికి సిద్ధమవుతుందా ? అంటే మారుతున్న రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 ఇంగ్లిష్ వెబ్ సైట్ ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది. నిన్నమొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ తో పవన్ కల్యాణ్ సన్నిహిత సంబంధాలు కొనసాగించారని.. ఎపీ ఎన్నికల్లో కేసీఆర్ తనకు మద్దతిస్తారని ఆయన ఆశించారని కానీ అనూహ్యంగా జగన్ కి కేసీఆర్ మద్దతు పలకడంతో పవన్ హర్టయ్యారని కధనంలో పేర్కొన్నారు. అంతే కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడం అంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా పవన్ భావిస్తున్నారని జాతీయ మీడియా చెబుతోంది. కేసీఆర్ – జగన్ కలయిక వల్లనే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ మళ్లీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ వీరిద్దరూ కలవడంపై విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబుపై కసితోనే జగన్ కేసీఆర్ తో కలుస్తున్నారని అయన విమర్శలు గుప్పించారు. ఇదే కాదు అంతకు ముందు నుంచి పవన్ కల్యాణ్ స్ట్రాటజీ మారుతూ వస్తోంది. క్రిస్మస్ పండుగకు యూరప్ వెళ్లి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ పూర్తిగా సైలెంటయిపోయారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న సమయంలో జగన్ పై విమర్శలు గుప్పించారు కానీ చంద్రబాబును విమర్శించలేదు. అదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో జగన్ తో పొత్తుల కోసం టీఆర్ఎస్ నేతలు రాయబారం నడుపుతున్నారని కూడా ప్రకటించిన సంచలనం రేపారు. ఇక రెండ్రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌ను విమర్శించొద్దంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ నాయకులకు సూచించడం దీనిని మరింత బలపరుస్తోంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో పవన్‌తో కలిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించిన బాబు జనసేనానిని విమర్శించొద్దంటూ చేసిన తాజా ఆదేశాలు ప్రాధాన్యాన్ని సంతరించకున్నాయి. శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలతో బాబు ఇలా మాట్లాడటం జనసేనతో పొత్తుకు బాబు సిద్ధపడుతున్నారనే సంకేతాలను పంపుతున్నాయి.

బాబు పవన్ తో కలిస్తే తప్పేంటని ఆడిన రెండురోజుల పాటు సైలెంట్ గా ఉన్న పవన్ కల్యాణ్ ఆ తర్వాత ఎవరితోనూ పొత్తు ఉండదని ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీలతో మాత్రమే పొత్తులుంటాయని ప్రకటించారు. వారితో సీట్ల సర్దుబాటు చర్చలు కూడా ప్రారంభించారు. అయితే అనూహ్యంగా జగన్, కేసీఆర్ మధ్య బంధం బలపడటంతో ఆ కూటమిపై విమర్శలు ప్రారంభించారు. చంద్రబాబు మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలతో జాతీయ మీడియాలో కూడా పవన్ కల్యాణ్ చంద్రబాబు వైపు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక బాబు ఆదేశాలతో.. గతంలో జగన్, మోదీ, కేసీఆర్‌‌లతోపాటు పవన్‌పై కూడా విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు ఇక నుంచి జనసేనానికి మినహాయింపు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత కాదనుకున్నా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు గత ఎన్నికల్లో పవన్ మద్దతు ప్రకటించడం టీడీపీ విజయానికి కొంత దోహదం చేసింది. అందుకే వచ్చే ఎన్నికల్లోనూ జనసేనానితో కలిసి నడవాలని బాబు యోచిస్తున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పొత్తు ఎప్పుడు పొడవనుందో ? ఏమో ?