టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఎన్నికల ముందా, వెనుకా ?

TDP and Congress alliance
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఎత్తులు, పొత్తులకు ఢిల్లీ వేదికగా పునాది పడింది. పార్లమెంట్ లోపల, బయట ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తున్న టీడీపీ, వైసీపీ హస్తినలో చేస్తున్న ఆందోళనల్లో ఎవరెవరు హాజరు వేయించుకున్నారో చూస్తే ఆ కొత్త రాజకీయం ఏంటో తేలిగ్గానే అర్ధం అవుతుంది. కాంగ్రెస్ నిర్వహించిన తెలుగు ఆత్మగౌరవ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఇక వైసీపీ చేసిన ఆందోళనలో వామపక్షాల నేతలు పాల్గొన్నారు. అయితే ఆంధ్రాలో వామపక్షాలతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయదలచిన జనసేన ప్రతినిధులు ఎవరు ఆ సభలో పాల్గొనలేదు. ఈ రెండు విషయాల్లో పెద్ద చిత్రం ఏమీ లేదు. కానీ ఢిల్లీ వేదికగా జరిగిన చిత్రాతి చిత్రాల్లో ఒకటి టీడీపీ చేస్తున్న ప్రదర్శనలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుక చౌదరి పాల్గోవడం. ఈ ఇద్దరు ఆషామాషీ నాయకులు ఏమీ కాదు. రేణుక కాంగ్రెస్ హైకమాండ్ కి తలలో నాలుక అయితే వై.ఎస్ మరణం తర్వాత కూడా ఆ పార్టీనే నమ్ముకున్న నాయకుడు కేవీపీ. జగన్ కొత్త పార్టీ పెట్టినా పోకుండా కేవీపీ కాంగ్రెస్ లో కొనసాగడం పెద్ద చిత్రం అయితే అనుక్షణం చంద్రబాబు ని విమర్శించే ఆయన హఠాత్తుగా టీడీపీ ఆందోళనలో నిలవడం అంతకన్నా చిత్రం.

కేవీపీ, రేణుక లు పచ్చ జెండాల మధ్య దర్శనం ఇవ్వడం మొదలు మాత్రమే అని ఢిల్లీ టాక్. ఈ మేరకు ఇప్పటికే లోపాయికారీగా చర్చలు జరిగాయట. ఆంధ్రాలో సొంతంగా ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ కన్నా ఎంతోకొంత వోట్ బ్యాంకు వున్న కాంగ్రెస్ తో కొనసాగడం మేలని సీఎం చంద్రబాబుకు పార్టీ వ్యూహకర్త ఒకరు నూరిపోస్తున్నారట. 2019 ఎన్నికల ముందు లేదా తరువాత అయినా కాంగ్రెస్ తో పొత్తు వల్ల ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లు హామీలు నెరవేర్చుకునే వెసులుబాటు దొరుకుతుందని ఆ వ్యూహకర్త చెప్పిన మాటలతో బాబు కూడా ఏకీభవించారట. అయితే విభజన ఎఫెక్ట్ తో కాంగ్రెస్ మీద పడిన మరక ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ సర్వే ఫలితాలు చూసాక కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఎన్నికల ముందా లేక తరువాతా అనేది తేలిపోతుంది.