సోనియా విందుకు చంద్రబాబు ?

Sonia Gandhi Invites opposition leaders for Dinner on March 13
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేం. అందుకు తాజా ఉదాహరణే ఈ నెల 13 న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తలపెట్టిన విందు. ఈశాన్య రాష్ట్రాల్లో దెబ్బ తిన్న కాంగ్రెస్ 2019 ఎన్నికల నాటికి రేసులో నిలబడాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలని ఒక్క తాటి మీదకు తేవాలని భావిస్తోంది. తెలంగాణ సీఎం కెసిఆర్ చేస్తున్న థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలకు ఇప్పుడే గండి కొట్టకపోతే మున్ముందు ఇబ్బందులు ఎదురు అవుతాయని సోనియా భావిస్తున్నారు. అందుకే వెంటనే బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడానికి సోనియా గాంధీ ఈ నెల 13 న ఢిల్లీలో విందు ఇస్తున్నారు.

కాంగ్రెస్ విందుకు ఒకప్పుడు, ఇప్పుడు యూపీఏ లో వున్న భాగస్వామ్య పక్షాలతో పాటు పిలవాలని సోనియా భావిస్తున్నారు. దాంతో పాటు nda లో అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ కి ఆహ్వానం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు అమలు చేయకుండా చంద్రబాబుని బీజేపీ దగా చేసిన తరుణంలో తమ ప్రభుత్వం వస్తే ఏపీ కి ప్రత్యేక హోదా మీద తొలి సంతకం పెడతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ తో ఈ రెండుమూడు రోజుల్లో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ ఇక కాంగ్రెస్ ఆహ్వానం విషయంలో ఎలా స్పందిస్తుందో అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీ తో తెగదెంపులు తర్వాత జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీ అండ కోసం కాంగ్రెస్ తో టీడీపీ సఖ్యముగా వుండే అవకాశం లేకపోలేదు. అయితే కాంగ్రెస్ విభజన పాపం తమకు కూడా అంటుకుంటుందేమో అన్న భయం టీడీపీకి లేకపోలేదు. ఆ భయంతో ఎటూ వెళ్లకపోతే రాజకీయంగా ఒంటరి అయ్యే ప్రమాదం వుంది. అందుకే సోనియా విందుకు చంద్రబాబు వెళ్లే అవకాశం వున్నా లేకున్నా తమ ప్రతినిధిని పంపే ఛాన్స్ వుంది. అదే జరిగితే టీడీపీ తో పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ఊపు రావడం ఖాయం.