ముగిసిన ప్ర‌చారప‌ర్వం

TDP and YSRCP Nandyal By elections campaigning finished

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చార ప‌ర్వం ముగిసింది. రాష్ట్రంలోనూ, న‌వ్యాంధ్ర‌లోనూ గ‌తంలో అనేక ఉప ఎన్నిక‌లు జ‌రిగినా… నంద్యాల ఉప ఎన్నికలో మాత్రం  ఇంత‌కుముందు ఎన్న‌డూ లేనంత‌గా రాజ‌కీయాలు వేడెక్కాయి. నోటిఫికేష‌న్ వెలువ‌డిన ద‌గ్గ‌ర‌నుంచే అధికార, ప్ర‌తిప‌క్షాలు నంద్యాల గెలుపు కోసం స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డాయి. ఈ ఉప ఎన్నిక‌ను రెండున్న‌రేళ్ల టీడీపీ పాల‌న‌పై రెఫ‌రెండంగా  భావించాల‌ని వైసీపీ కోరుతోంది. అయితే ఈ ఎన్నిక రెఫ‌రెండం కాదంటున్న టీడీపీ … గెలుపు మాత్రం త‌మ‌దే అని ధీమా వ్య‌క్తంచేస్తోంది.

ఈ ఉప ఎన్నిక ప్ర‌చార స‌మ‌యంలోనే తొలిసారి రాజ‌కీయాల్లో జ‌గ‌న్ వైఖ‌రి ఎలా ఉంటుందో ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా తెలుసుకున్నారు. ముఖ్య‌మంత్రిని న‌డిరోడ్డుమీద కాల్చిచంపినా త‌ప్పులేదు… ఉరితీసినా త‌ప్పులేదు అని వ్యాఖ్యానించ‌టం ద్వారా రాష్ట్రంలో పెనుదుమార‌మే సృష్టించారు. ఈ వ్యాఖ్య‌ల‌కు గానూ ఈసీకి ఆయ‌న వివ‌ర‌ణ కూడా ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. వైసీపీ అభ్య‌ర్థి కి వేసే ప్ర‌తి ఓటు త‌న‌కు వేసిన‌ట్టే భావించాల‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను కోరారు. ఉప ఎన్నిక‌ను టీడీపీ పాల‌న‌పై రెఫ‌రెండంగా ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తున్న వైసీపీ ఎలాగైనా గెలిచేందుకు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెడుతోంద‌ని, పెద్ద ఎత్తున డ‌బ్బులు పంచుతోంద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. అటు జ‌గ‌న్ తో పాటు … ఆ పార్టీ మ‌రో ప్ర‌ముఖ నాయ‌కురాలు రోజా కూడా వివాదా స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అఖిల‌ప్రియ డ్రెస కోడ్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్య‌లపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌ర‌నోవైపు  ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ  నంద్యాల లో పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించింది.

కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాల‌లోనే తిష్ట‌వేసి ఎప్ప‌టిక‌ప్పుడు పరిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా రెండు రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షోలు నిర్వ‌హించారు. త‌న‌ను కాల్చిచంప‌మ‌న్న వైసీపీని కాల్చొద్దు, చంపొద్దు అని  ఓటు ద్వారా ఖ‌తం చేయాల‌ని పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో ప్ర‌జ‌లు టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని గెలిపిస్తే త‌న‌కు ఎంతో ఉత్సాహ‌మొస్తుంద‌ని… ప్ర‌జ‌ల‌కు మరిన్నిమంచి కార్య‌క్ర‌మాలు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌తిఒక్క‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని కోరారు. టీడీపీ త‌ర‌పున హిందూపురం ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, హాస్య న‌టుడు వేణు మాధ‌వ్ కూడా ప్ర‌చారం చేశారు. మొత్తానికి హోరాహోరీగా సాగిన ప్ర‌చారం ప‌ర్వం ముగిసింది. ఇక ఎన్నిక, కౌంటింగ్ మిగిలిఉన్నాయి. ఈ నెల 23న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుండ‌గా, 28న కౌంటింగ్ నిర్వ‌హిస్తారు.

మరిన్ని వార్తలు:

ఆ కాల‌నీని ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు?

ఆఫ్ఘ‌నిస్థాన్ వ్యూహంలో భార‌త్ కీల‌క పాత్ర‌

ఒకే కొమ్మ కింద‌కు రెండాకులు