పులివెందులపై టీడీపీ ఫోకస్ – జగన్‌కు చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్!

YS Jagan
YS Jagan

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కోటగా మారిన పులివెందుల మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే ఏపీలో పలు మున్సిపాలిటీల్లో టీడీపీ ఆధిపత్యం సాధించగా, పులివెందులలోనూ జగన్‌ను ఎదుర్కొనేలా కసరత్తు ప్రారంభించింది. ప్రజాదరణ ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. స్థానిక నేతలు హైకమాండ్‌కు వివరాలు అందజేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

పులివెందులలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదా సహా 20 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. దీంతోపాటు స్థానికంగా మరిన్ని కీలక నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

జగన్‌పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి భారీ విజయం సాధించగా, వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, పాలనాపరమైన వైఫల్యాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ముఖ్యంగా పోలవరంపై ఆలస్యమైన పనులు, సంక్షేమ పథకాల ఆచరణలో లోపాలు, విభజన రాజకీయాలు ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకతను పెంచాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ కూటమిలో చేరుతున్నారు. పులివెందులలో కూడా ఇదే బాటలో మార్పులు జరుగుతున్నాయి.