Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయవాడ వేదికగా జరుగుతున్న మహానాడులో చంద్రబాబు జాతీయరాజకీయాల్లో ప్రవేశించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతున్నారు టీడీపీ నేతలు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమయిందని మహానాడు ప్రసంగంలో టీడీపీ ఎంపీ కేశినాని నాని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేశారని, ఇప్పుడు మాత్రం రాష్ట్రాల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రప్రభుత్వం నియంత్రిస్తోందని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తే రాష్ట్రానికి రూ.7వేల కోట్లు నష్టం వస్తుందని కేశినేని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా కేంద్ర సర్కార్ వ్యవహరించాలని కోరారు. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని విజ్ఞప్తిచేశారు.
చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని మహానాడు ప్రసంగంలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానంటారు… ఏంది సర్ నాకు అర్థం కాదు… ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు… ఇక చాలదా మీకు..? ఇంకా ఆశ ఉందా…? వద్దు… మీరు ఇంకా పైకి రావాలి… దేశానికి ప్రధానమంత్రి కావాలి… మేమంతా సంతోషిస్తాం అని జేసీ చెప్పారు. కుటుంబపాలన విమర్శలను కూడా జేసీ ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారని, టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారని, టీడీపీ చంద్రబాబు ఆస్తి అని, దాని వారసుడు కచ్చితంగా లోకేశే అని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తర్వాత లోకేశ్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని జేసీ అభిప్రాయపడ్డారు. జగన్ మాట్లాడితే చంద్రబాబు రెండెకరాల నుంచి లక్షల కోట్ల ఆస్తి సంపాదించారని ఆరోపిస్తున్నారని, పెట్రోల్ బంక్ లో పనిచేసిన ధీరూభాయ్ అంబానీ లక్షల కోట్ల ఆస్తి సంపాదించలేదా…ఆస్తులు సంపాదించుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. దేశం బాగుపడాలంటే చంద్రబాబు ప్రధానమంత్రి కావాలన్నారు. నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నంతవరకు ప్రత్యేక హోదా రాదని, ఈ విషయం నాలుగేళ్ల క్రితమే తాను చెప్పానని గుర్తుచేశారు.
చంద్రబాబు దయతోనే ఏపీలో బీజేపీకి కొన్నిసీట్లయినా వచ్చాయన్నారు. కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు రావడానికి కారణం చంద్రబాబేనని, మోడీ కియా ప్రతినిధులకు ఐదుసార్లు ఫోన్ చేసి గుజరాత్ లో ప్లాంట్ పెట్టాలని ఒత్తిడి చేసినట్టు వారే చెప్పారని జేసీ తెలిపారు. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతంనమోదయ్యే అనంతపురం జిల్లాను చంద్రబాబు సస్యశ్యామలం చేస్తున్నారని, కోనసీమను తలపించేలా తీర్చిదిద్దుతున్నారని జేసీ కొనియాడారు. వైసీపీ అధినేత జగన్ పై తన ప్రసంగంలో జేసీ విరుచుకుపడ్డారు. జగన్ కు తాత లక్షణాలే వచ్చాయని, జగన్ తీరుపై ఆయన తండ్రి వైఎస్ ఎంతగానో బాధపడేవారని అన్నారు. జగన్ ది ఎవరిమాటా వినని తత్త్వమన్నారు. వైసీపీలో చేరమని జగన్ తనకు రాయబారం పంపారని, ఎన్ని సీట్లు కావాలన్నా ఇస్తామని విజయసాయిరెడ్డి తన వద్దకు వచ్చారని, కానీ జగన్ సంగతి తెలిసి తాను తిరస్కరించానని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిందన్నారు జేసీ.