లిఫ్ట్‌లో ఇరుక్కున్న టీడీపీ నేతలు !

tdp leaders got stuck in lift AT vijayawada

రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్‌లో ఇద్దరు టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంట పాటు నేతలు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్‌లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి ఎట్టకేలకు లిఫ్ట్‌ డోర్‌ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు.

వీరితోపాటు ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అనుచరులతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తుండగా సాంకేతిక లోపంతో అది మధ్యలో ఆగిపోయింది. దీంతో 15 నిమిషాలపాటు నేతలు లిఫ్ట్‌లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. శ్వాస అందక ఒక దశలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో లిఫ్ట్‌లోని నేతలు ఫోన్‌ ద్వారా బయట ఉన్నవారికి సమాచారం అందించడంతో.. సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. సెక్యూరిటీ సిబ్బంది కర్రలు, రాడ్లతో లిఫ్ట్‌ను పగులగొట్టి వారిని సురక్షితంగా బయటకు తీశారు. లిఫ్ట్‌ డోర్‌ను తొలగించి వారిని బయటకు తీసుకురావడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.