కారెక్కుతారా….ఎక్కితే బాబుకి కష్ట కాలమే…!

Sattupalli MLA Sandra Venkata Veeraiah To Join TRS Party

ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి. కొంత మంది టీడీపీ నేతలు తెర వెనుక మాయ చేయడంతో ఖమ్మంలోనామా నాగేశ్వరరావు ఓడిపోయారు కానీ లేకపోతే ఆ ఒక్క సీటు కూడా వచ్చేది కాదు. గెలవకపోతే పోయారు గెలిచిన వాళ్లను పార్టీలో చేర్చుకుందామని టీఆర్ఎస్ నేతలు తాపత్రయ పడుతున్నారు. అందుకే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరిపై మైండ్ గేమ్ ప్రారంభించారు. ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారని ఆ పదవి సండ్రకే వస్తుందని చెబుతున్నారు. గతకొద్ది రోజులుగా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన అధికార టీఆరెస్ లో చేరతారని అనుకుంటున్నారు. దాంతో అయోమయానికి గురైన టీడీపీ కార్యకర్తలు రెండు రోజులుగా ఎమ్మెల్యే సండ్రతో భేటీ అవుతున్నారు. అయితే తాను ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఈ సందర్భంగా సండ్ర వారికి చెప్పినట్లు సమాచారం. వెంకటవీరయ్య మంత్రి పదవి ఆఫర్‌తో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని తాము భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కానీ మరోపక్క వినిపిస్తున్న ప్రచారం మేరకు ఆయనకు తొలి విడతలోనే మంత్రివర్గంలో చోటు దక్కనుందని తెలుస్తున్నది.

ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సమ్మతించినట్టు సమాచారం. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారికి తొలి విడతలోను ఫిరాయింపుల ద్వారా వచ్చిన వారికి మలి విడతలోనూ మంత్రి పదవులివ్వాలని సీఎం భావించారు. కానీ ఇందుకు సండ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈనెల 20న సండ్ర కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తనకు తొలి విడతలోనే బెర్తు ఖాయం చేయాలంటూ సీఎంను ఆయన కోరారు. మొదటి విడతలో మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గ అభివృద్ది కోసమని చెప్పుకునే వీలుంటుందని సండ్ర సీఎంకు వివరించారు. ఇందుకు కేసీఆర్ అంగీకరించారని తెలిసింది. సండ్రను గులాబీ కారు ఎక్కించేస్తే.. బాబు ఆయువు పట్టు మీద దెబ్బ తీయొచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. అదెలానంటే సండ్ర పార్టీ మారినవెంటనే.. ఓటుకు నోటు కేసులో అప్రూవర్ గా మారిపోయి జరిగిన విషయాన్ని చెప్పేయటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. ఏ వ్యవస్థ కూడా చంద్రబాబును రక్షించలేదని ఆయనకు జైలు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంతోనే సండ్ర చేజారిపోకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా? కేసీఆర్ ప్లానింగ్ వర్క్ వుట్ అవుతుందా? అనేది వేచి చూడక తప్పదు.