Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అంటే సీఎం చంద్రబాబుకి ఎక్కడలేని గురి. అందుకే ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేకపోయినా అడిగిన పని వెంటనే చేసిపెడతారని గుంటూరు జిల్లాలో ఓ టాక్ వినిపిస్తుంటుంది. అందుకే ఆ జిల్లా టీడీపీ నాయకులు ఆయన్ని అనధికార మినిస్టర్ అని సరదాగా పిలుస్తుంటారు. చంద్రబాబు అంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం లేకపోలేదు. 2014 ఎన్నికలకి ఏడాది ముందు పార్టీ కష్టాల్లో వున్నప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేద్దామని భావించారు . అయితే బాబు రెండు కళ్ళ సిద్ధాంతం వల్ల పాదయాత్రలో నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని నాయకులు చాలా మంది అధినేతని నిరుత్సాహపరిచారు. కానీ యరపతినేని ఇవేమీ లెక్కచేయకుండా చంద్రబాబు పాదయత్రకి తన నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టించారు. తర్వాత ఆ పాదయాత్ర ఎంతగా ఉపయోగపడిందో అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలోను బాబుకి వున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని పదవి రాకపోయినా యరపతినేని ఒక్క మాట మాట్లాడలేదు.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అభిమానం చూరగొన్న యరపతినేని గురజాల నియోజకవర్గ అభివృద్ధికి దాన్ని వాడుకుంటున్నారు. దీంతో ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అంచనా వేసే జగన్ పల్నాడులో గట్టి పేరున్న కాసు కుటుంబ వారసుడు మహేష్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. నరసరావుపేట నుంచి నాయకుడు వచ్చినా గురజాలలో వైసీపీ కి అదనంగా కలిగిన ప్రయోజనం ఏమీ లేదు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే యరపతినేని కొత్త కొత్త ఆలోచనలు, అస్త్రాలు. తాజాగా ఆయన సంధిస్తున్న సెంటిమెంట్ అస్త్రాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కాసు మహేష్ రెడ్డి తలలు బద్దలు కొట్టుకుంటున్నారట.
60 ఏళ్ళు నిండిన వాళ్లకి షష్టిపూర్తి, గర్భిణికి శ్రీమంతం వంటివి ఆయా కుటుంబాలు చేసుకునే వ్యవహారాలు. ఆర్ధిక స్థోమత లేని కుటుంబాల్లో ఇలాంటి ఫంక్షన్స్ కి తావు ఉండదు. అయితే యరపతినేని తన సొంత డబ్బులతో నియోజకవర్గం అంతటా ఈ కార్యక్రమాల్ని సామూహికంగా నిర్వహిస్తున్నారు. దీంతో సంతానం కూడా పట్టించుకోని వృద్ధులు తనకి జరిగిన గౌరవాన్ని తలచుకుని మనసారా ఎమ్మెల్యేని ఆశీర్వదిస్తున్నారు. ఇక నిండు గర్భిణీలు కూడా తమ శ్రీమంతం జరిపిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో గురజాలలో సాగుతున్న ఈ సెంటిమెంట్ రాజకీయం మీద కనీసం విమర్శ చేయడానికి కూడా భయపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. కౌంటర్ గా ఏమి చేయాలో అర్ధం గాక , ఎమ్మెల్యే చేస్తున్న పనే చేస్తే కాపీ అంటారేమో అన్న భయంతో అలా గడిపేస్తున్నారు.