ప్ర‌ధాని నివాసం ముట్ట‌డికి టీడీపీ ఎంపీల య‌త్నం….అడ్డుకున్న పోలీసులు

TDP MPs attempt to protest in AP Special Status Demand near Modi residence

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విభ‌జ‌న హామీల అమ‌లుకోసం టీడీపీ ఎంపీలు ఢిల్లీలో పోరు ఉధృతంచేశారు. ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈ ఉద‌యం టీడీపీ ఎంపీలు ప్ర‌ధాని నివాసాన్ని ముట్ట‌డించ‌డం ఉద్రిక్త‌త‌కు దారితీసింది. రాజ్య‌స‌భ ఎంపీ సుజ‌నా చౌద‌రి నివాసంలో స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించిన ఎంపీలు అక్క‌డి నుంచి ర్యాలీగా వెళ్లి ప్ర‌ధాని నివాసం ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. ప్ల‌కార్డులు చేత‌బ‌ట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు న్యాయం చేయాల‌ని నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న ఎంపీల‌ను పోలీసులు, భ‌ద్ర‌తాబ‌ల‌గాలు అక్క‌డినుంచి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో వారంతా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని బ‌లవంతంగా త‌ర‌లించే క్ర‌మంలో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిని లాగిప‌డేశారు. మిగిలిన ఎంపీల‌ను కూడా బ‌ల‌వంతంగా కాళ్లు, చేతులు ప‌ట్టుకుని బ‌స్సులో ఎక్కించి అక్క‌డి నుంచి త‌రలించారు. ఈ స‌మ‌యంలో పోలీసుల‌కు, ఎంపీల‌కు మ‌ధ్య స్వ‌ల్ప తోపులాట చేసుకుంది. తాము శాంతియుతంగా ఆందోళ‌న చేస్తోంటే బ‌ల‌వంతంగా త‌ర‌లించ‌డం ప్ర‌జాస్వామ్య వ్యతిరేక‌మ‌ని ఎంపీలు మండిప‌డ్డారు.

ఈ చ‌ర్య‌తో మోడీ నిరంకుశ‌త్వం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. రాష్ట్రానికి న్యాయం జ‌రిగేవ‌ర‌కు ఆందోళ‌న విర‌మించేది లేద‌ని స్ప‌ష్టంచేశారు. పార్ల‌మెంట్ లో రోజుల త‌ర‌బ‌డి గొంతుచించుకున్నా కేంద్రం ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. తామంతా ప్ర‌జాప్ర‌తినిధుల‌మ‌ని కూడా చూడ‌కుండా ఈడ్చుకెళ్లార‌ని, మోడీ స‌ర్కార్ ఆదేశాల‌తోనే పోలీసులు త‌మ ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీల‌నూ త‌క్షణం నెర‌వేర్చ‌ల‌న్న‌దే త‌మ డిమాండ‌ని, ఈ విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్ఠంచేశారు.